ఇక ఫైబర్‌ గ్రిడ్‌ నుంచే ఓట్ల తొలగింపు వ్యూహం..?

5 Mar, 2019 04:34 IST|Sakshi

ఫైబర్‌గ్రిడ్‌ కనెక్షన్లు కేంద్రంగా ఓట్ల తొలగింపునకు టీడీపీ కుతంత్రం

ప్రత్యేక ఐపీ నంబర్‌ లేకుండానే రాష్ట్రంలో ఫైబర్‌గ్రిడ్‌ కనెక్షన్లు 

ఓట్ల అక్రమ తొలగింపు, రాజకీయ దుష్ప్రచారానికి ముఖ్యనేత పన్నాగం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓట్ల అక్రమ తొలగింపునకు టీడీపీ ప్రభుత్వం మరింతగా బరితెగిస్తోంది. ఇప్పటికే ముఖ్యనేత సన్నిహితులకు చెందిన హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ద్వారా భారీగా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలంగాణ పోలీసుల దాడుల్లో ఈ బాగోతం ఆధారాలతోసహా బట్టబయలైనప్పటికీ ముఖ్యనేత మరో వ్యూహం అమలుచేయనున్నారు. ఈసారి ఏపీ కేంద్రంగానే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. తన బినామీల గుప్పిట్లో ఉన్న ఫైబర్‌గ్రిడ్‌ కేంద్రంగా ఓట్ల తొలగింపుకు సిద్ధపడుతున్నారు.

టెలికాం చట్టానికి విరుద్ధంగా ఫైబర్‌గ్రిడ్‌ కనెక్షన్లు 
భవిష్యత్‌ రాజకీయ అవసరాలు, ఎన్నికల అక్రమాలకు పాల్పడే ఉద్దేశంతోనే ముఖ్యనేత రాష్ట్ర ఫైబర్‌గ్రిడ్‌ లిమిటెడ్‌ను వ్యూహాత్మకంగా తన బినామీల గుప్పిట్లో పెట్టారు. సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన వేమూరి హరిప్రసాద్‌కు చెందిన సంస్థలకు ఫైబర్‌గ్రిడ్‌ కాంట్రాక్టులను కట్టబెట్టారు. పేరుకు కొందరు ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ వ్యవహారాలన్నీ సీఎం సన్నిహితులకు చెందిన టెరాసాఫ్ట్‌ తదితర సంస్థలే నిర్వహిస్తున్నాయి. కాగా రాష్ట్రంలో ఫైబర్‌గ్రిడ్‌ కింద ఇంటర్నెట్, టీవీ, ఫోన్‌ కనెక్షన్లు ఇవ్వడంలో కేంద్ర టెలికాం నిబంధనలను ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. నిబంధనల ప్రకారం ప్రతి ఇంటర్నెట్‌ కనెక్షన్‌కు ఓ ప్రత్యేక ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌(ఐపీ) నంబర్‌ కేటాయించాలి. ఇంటర్నెట్‌ కనెక్షన్లను దుర్వినియోగం చేస్తే ఐపీ నంబర్‌ ఆధారంగానే దోషులను గుర్తించి సైబర్‌ చట్టాల కింద కేసులు నమోదు చేస్తారు. అందుకే దేశంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇచ్చే ఇంటర్నెట్‌ కనెక్షన్లకు ఈ విధంగానే ప్రత్యేక ఐపీ నంబర్లు కేటాయిస్తారు. కానీ రాష్ట్రంలో ఫైబర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌కు మాత్రం ఈ నిబంధనలేదు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 12 లక్షల వరకు ఫైబర్‌నెట్‌ కనెక్షన్లు ఇచ్చారు. కానీ వాటికి ప్రత్యేక ఐపీ నంబర్లు కేటాయించలేదు. ఈ ఫైబర్‌గ్రిడ్‌ కనెక్షన్లలో ఎవరైనా టెలికాం, సైబర్‌ చట్టాలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడితే అందుకు బాధ్యులు ఎవరో గుర్తించడం చాలా కష్టం.   

టీడీపీ ఎన్నారై విభాగం నేతృత్వంలో అక్రమాలు
హైదరాబాద్‌ నుంచి ఓట్ల తొలగింపు వ్యూహం బెడిసికొట్టడంతో రాష్ట్రంలో ఎంపిక చేసిన కేంద్రాల నుంచి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు, ఇతర ఎన్నికల అక్రమాలు కొనసాగించమని ముఖ్యనేత ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఫైబర్‌గ్రిడ్‌ లిమిటెడ్‌లోని ముఖ్యనేత సన్నిహితులు రంగంలోకి దిగారు. టీడీపీ ఎన్నారై విభాగం నేతృత్వంలో అక్రమాలకు దిగనున్నారు. ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి ఇటీవల విజయవాడలో ఓ సంస్థను ప్రారంభించారు. టీడీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం కోసమే ఆ సంస్థ పనిచేస్తుంది. ప్రస్తుతం ఆ సంస్థ ఫైబర్‌గ్రిడ్‌ కనెక్షన్లను ఉపయోగిస్తూ ఎన్నికల అక్రమాలకు తెరతీసింది. ప్రభుత్వం ప్రజాసాధికార సర్వే ద్వారా సేకరించిన ప్రజల సమాచారం మొత్తం ఆ సంస్థకు చేరవేశారు. ఓటర్ల వివరాలతో తుది జాబితా ప్రకటించేలోగానే వీలైనంతమంది వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం భారీగా దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంతేగాక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ ఇతర ముఖ్యనేతలు, పార్టీ వ్యవహారాలపై పెద్ద ఎత్తున సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేయాలన్నది టీడీపీ వ్యూహం. 2014 ఎన్నికల్లో కూడా ఆ ఎన్నారై మరికొందరితో కలసి ఇదే విధంగా వైఎస్‌ జగన్‌పై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారానికి నేతృత్వం వహించారు. మన రాష్ట్రం నుంచే ఈ అక్రమాలకు పాల్పడితే కేసులు లేకుండా చూసుకోవచ్చని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు