బెల్టు తీస్తారా!

12 Jun, 2014 05:16 IST|Sakshi
బెల్టు తీస్తారా!

 బెల్టు దుకాణాల రద్దుకు అడ్డంకులెన్నో
- నాలుగు రోజుల్లో ఏడు కేసులతో సరి
- ఎక్సైజ్ శాఖలో వాహనాల కొరత
- అద్దె వాహనాలకు 16 నెలలుగా అందని బిల్లులు

కర్నూలు: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే రుణమాఫీపై మెలిక పెట్టి తన నైజాన్ని చాటుకున్నాడు. అదే రోజు బెల్టు దుకాణాల రద్దు ఫైల్‌పై సంతకం చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ అధికారులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు సంపూర్ణ మద్యాపానాన్ని విధిస్తే..ఆయన దగ్గర నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు మద్యాపాన నిషేదాన్ని ఎత్తివేసి వీధివీధికి బెల్టు షాపు వెలిసేలా చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బెల్టు దుకాణాలను పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం జీవో జారీ చేసి నాలుగు రోజులు గడిచినా ఇప్పటి వరకు నందికొట్కూరులో 2, ఎమ్మిగనూరులో 2.. కర్నూలు, కోసిగి, కోడుమూరులో ఒక్కొక్కటి చొప్పున మాత్రమే కేసులు నమోదయ్యాయి.
 
వేధిస్తున్న వాహనాలు, సిబ్బంది కొరత..
ఎక్సైజ్‌శాఖలో వాహనాలు, సిబ్బంది కొరత వేధిస్తోంది. మద్యం అక్రమ వ్యాపారంపై నిఘాకు ఈ శాఖలో డీటీఎఫ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు అత్యంత కీలకం. ఈ విభాగాలకు సంబంధించిన అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించేందుకు అవసరమైన సంఖ్యలో వాహనాలు లేకపోవడంతో వీరి పనితీరు నామమాత్రమవుతోంది. డీటీఎఫ్‌లో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌తో పాటు సీఐ, ఎస్‌ఐ, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ఆరుగురు కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో ఏఈఎస్ పోస్టు ఏడాది నుంచి ఖాళీగా ఉంది. ముగ్గురు ఎస్‌ఐలకు గాను ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

ఐదుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 18 మంది కానిస్టేబుళ్లు ఉండగా.. ఒక్క వాహనమే గతి. కర్నూలు ఎక్సైజ్ పరిధిలో 13, నంద్యాల ఎక్సైజ్ పరిధిలో 10 అద్దె వాహనాలను అధికారులు వినియోగిస్తున్నారు. వీటికి నెలకు కనీసం రూ.6 లక్షలు చొప్పున 16 నెలలకు సంబంధించి ప్రభుత్వం దాదాపు కోటి రూపాయలు బకాయి పడింది. ఈ కారణంగా అద్దె వాహనాల వినియోగానికి ఎక్సైజ్ శాఖ అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో రూ.5 లక్షల బడ్జెట్ విడుదలైనా అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో నిధులు వెనక్కి మళ్లింది. బెల్టు దుకాణాల తనిఖీకి వెళ్లాలంటే రోజూ కనీసం రూ.2 వేలకు పైగా ఖర్చవుతుందని అధికారుల అంచనా. వాహనానికి డీజిల్, డ్రైవర్ బత్తా, వెంట వచ్చిన సిబ్బందికి భోజనం ఖర్చులు తడిసి మోపెడవుతుండటంతో అధికారులు తనిఖీలంటేనే జంకుతున్నారు.
 
మారిన వేళలు..
ఎక్సైజ్ అధికారులు తనిఖీలకు వస్తారనే భయంతో జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న బెల్టు దుకాణాదారులు సమయపాలన మార్చుకున్నారు. గతంలో రాత్రి, పగలు తేడా లేకుండా బహిరంగ వ్యాపారం సాగింది. ప్రస్తుతం దాడులు ముమ్మరం చేయడంతో కర్నూలు చుట్టూ ఉన్న పడిదెంపాడు, మునగాలపాడు, భూపాల్‌నగర్, ఆర్.కొంతలపాడు, సుంకేసుల, ఎదురూరు, ఉల్చాల, దిగువపాడు, పూడూరు, గొందిపర్ల గ్రామాల్లో బెల్టు దుకాణాల ద్వారా రాత్రి వేళల్లో బెల్టు షాపులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు