‘బెల్టు’ తీస్తేనే బతుకులు బాగు

14 Jun, 2019 12:49 IST|Sakshi

సాక్షి,బాపట్ల : కుటుంబాల్ని కూల్చేస్తుంది.. చిన్నారుల్ని అనాథల్ని చేసేస్తుంది. ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తుంది. మొత్తంగా సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తోందీ మద్యం. ఎన్నో జీవితాల ఉసురు పోసుకుంటున్న మద్యాన్ని నిషేదిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మూలాల నుంచి ప్రక్షాళన చేసేందుకు బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపుతున్నారు. మరోవైపు మద్యం దుకాణాల లైసెన్సుల్ని తగ్గించే దిశగా రూపుదిద్దుకుంటున్న సర్కారు కార్యచరణపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
మద్యం మహమ్మారితో మహిళలు పడుతున్న వేదనలను ప్రజాసంకల్ప యాత్రలో విన్న వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చలించారు. మద్యం మత్తుకు బానిసలైన మందు బాబులు సాయంత్రానికి తమ కష్టాన్ని తాగుడుకి తగలేస్తూ కుటుంబాలను పస్తులు పెడుతున్నారనే ఆవేదనలు.. మద్యం మత్తులో గొడవలు, ఘర్షణలకు దిగుతూ సంసారాలను వీధిన పెడుతున్న వేదనలు విన్న జగన్‌.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నవరత్నాల పథకాల్లో పొందుపరిచిన హామీ అయిన మద్యం మహమ్మారిని పారదోలేందుకు సమాయత్తమయ్యారు.

దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానంటూ ప్రకటించారు. బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపారు. పేద కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న బెల్టుషాపులను తొలగించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మద్యం వ్యాపారం ప్రభుత్వ ఆదాయంగా చూడొద్దని స్పష్టం చేశారు. అవసరమైతే బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేసే షాపుల లైసెన్సులను రద్దు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మద్య నిషేధానికి తొలి అడుగు వేయడంతో మహిళల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేస్తున్న మద్యం రక్కసిని నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కార్యచరణ రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్టుషాపులను పూర్తిగా నిర్మూలించడంతో పాటు మద్యం షాపులను దశల వారీగా తగ్గించి రానున్న ఐదేళ్ళ నాటికి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసేదిశగా అడుగులు వేస్తున్నారు.


మామూళ్ల కోసం...
గత ప్రభుత్వంలో ఎక్సైజ్, పోలీసు శాఖలు మద్యం వ్యాపారులకు సహకరించారు. బెల్టుదుకాణాల ఏర్పాటుకు అనధికారికంగా అనుమతులిచ్చేశారు.   దీనికి ప్రతిఫలంగా ప్రతి నెలా ఆ రెండు శాఖల సిబ్బంది మామూళ్లు పుచ్చుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఎమ్మార్పీ ఉల్లంఘించినా పట్టించుకోకపోవడం.. కొత్తగా బెల్టుదుకాణాలు వెలుస్తున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరించేవారు. ఇకపై ఆ పరిస్థితి కనిపించదు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయించినా చర్యలు తీసుకునేందుకు ఎక్సైజ్‌ అధికారులు ముందుకొస్తున్నారు. ఇటీవల బాపట్లలోని పాతబస్టాండ్‌ వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఉదయం పూట మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు చర్యలు తీసుకున్నారు. బాపట్ల ప్రాంతంలోని స్టువర్టుపురంలో నాటు సారా తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. చాలా వరకు సారా తయారీ మానేసినప్పటికి ప్రకాశం జిల్లా నుంచి దిగుమతవుతోందనే విమర్శలు కూడా లేకపోలేదు.


మద్యం మత్తులో మృత్యు ఒడిలోకి..
పూటుగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల మృతి చెందిన వారి సంఖ్య బాపట్ల నియోజకవర్గం బాపట్ల డివిజన్‌లోనే మొదటి స్థానంలో ఉంది. నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం మండలం కోమలిలో 2010 సంవత్సరం ట్రాక్టర్‌ డ్రైవర్‌ మద్యం సేవించి ట్రాక్టర్‌ నడపటం వలన శుభాకార్యానికి వెళ్తుతున్న 11మంది మృత్యువాత పడ్డారు. అదేవిధంగా 2011లో చందోలులో కారుడ్రైవర్‌ తప్పతాగి చెట్టుకు ఢీకొట్టడం వలన ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మరణించారు. 2018లో జమ్ములపాలెం ప్‌లైఓవర్‌ బ్రిడ్జి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బస్టాండ్‌ వద్ద పూటుగా మద్యం సేవించి ఆర్టీసీ బస్సును ఢీకొట్టి ఇద్దరు మృతి చెందారు. ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్‌ నుంచి సూర్యలంక సముద్రతీరానికి వచ్చి మద్యం సేవించి కారు నడుపుతూ అప్పికట్ల వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఇలా ఎంతో మంది కుటుంబాల ఉసురు తీస్తున్న మద్యాన్ని నిషేదించాలని పలువురు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు