అపచారం.. అహంకారం

15 Nov, 2017 11:14 IST|Sakshi

కార్తీకమాసంలో శివుడికి పరాభవం

చెప్పులేసుకుని విగ్రహాల తొలగింపు

హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ స్థానికుల ఆందోళన

 మద్దతు పలికిన వైఎస్సార్‌ సీపీ నేతలు

 మంత్రి జవహర్‌ ఇలాకాలో దుర్మార్గం

కార్తీక మాసంలో హిందువులు శివారాధన ఎంతో పవిత్రంగా భావిస్తారు. అటువంటి పరమశివుడికి కార్తీక మాసంలోనే పరాభవం ఎదురైంది. రాష్ట్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ ఇలాకాలో ఇది జరిగింది. 

కొవ్వూరు రూరల్‌: కొవ్వూరు పట్టణంలో శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న శ్రీనివాస స్నానఘట్టంలో భక్తులు ఏర్పాటు చేసుకున్న శివలింగాన్ని మంగళవారం పోలీసుల సహకారంతో అధికారులు తొలగించడం వివాదాస్పదం అయింది. చెప్పులతోనే సిబ్బంది విగ్రహాలు తొలగించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. విగ్రహాల తొలిగింపుపై ఆందోళనకు దిగిన స్థానికులకు వైఎస్సార్‌ సీపీ నేతలు అండగా నిలిచారు. సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లిన జిల్లా వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి పరిమి హరిచరణ్‌ను, పలువురు స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కి తరలించారు. సోమవారం అర్ధరాత్రే పోలీసుల సాయంతో అధికారులు విగ్రహాన్ని తొలగించడానికి వెళ్లారు. స్థానికులు ప్రతిçఘటించడంతో అధికారులు వెనుతిరిగారు.

 మంగళవారం గణపతి హోమం నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ తరుణంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి బలవంతంగా శివలింగాన్ని, గణపతి, నంది విగ్రహాలతో పాటు, శివుడికి ప్రార్థన చేసే రావణబ్రహ్మ విగ్రహాలను తొలగించడానికి పూనుకున్నారు. తొలగించిన విగ్రహాలను వ్యాన్‌లో ధవళేశ్వరంలోని నీటిపారుదల శాఖ కార్యాలయా నికి తరలించారు. రావణబ్రహ్మా విగ్రహాన్ని మాత్రం పూర్తిగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసు అడ్డుకున్నారు. నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దాంతో వైఎస్సార్‌ సీపీ నాయకులు పోలీసు స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. 

పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత ఆధ్వర్యంలో సుమారు మూడు గంటల పాటు స్టేషన్‌ ఎదుటే ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయల్దేరి మొయిన్‌ రోడ్డు మీదుగా ఫ్యాక్టరీ రోడ్డు నుంచి సంఘటనా స్థలం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. మళ్లీ పోలీసులు అడ్డుకున్నారు. ప్రతిఘటించిన జిల్లా ప్రధాన కార్యదర్శి బండి పట్టాభిరామారావు (అబ్బులు)ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. దీంతో నాయకులు ఆంధ్రాషుగర్స్‌ ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డుపైనే బైఠాయించి రాస్తారోకో చేశారు. ప్రభుత్వ తీరుపై నాయకులు తీవ్రస్థాయిలో మండి పడ్డారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వ అధికారులు వ్యవహరించారని అన్నారు. 

ఆర్డీవోని కలిసి సోమవారం వినతిప్రతం అందజేశామని, కనీసం పరిగణనలోకి తీసుకోకుండా విగ్రహం తొలగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కార్తీక మాసంలో శివలింగం, గణపతి, నందీశ్వరుడి విగ్రహాలను తొలగించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. టూరిజం పేరుతో మంత్రి, అతని అనుయాయులు ఆక్రమించా లనుకున్న 9 ఎకరాల స్థలంలో కొద్ది సెంట్ల స్థలంలో ఉన్న శివలింగమే అడ్డు వచ్చిందా అని ప్రశ్నించారు. తక్షణమే తొలగించిన విగ్రహాన్ని పునః ప్రతిష్ట చేయాలని డిమాండు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోడూరి శివరామకృష్ణ మాట్లాడుతూ పవిత్రమైన గోదావరి తీరంలో 2003 పుష్కరాల్లో దొరికిన అతి పురాతన శివలింగాన్ని భక్తులు ప్రతిష్టించుకుంటే, అధికారులు తొలగించడం దారుణమన్నారు. టూరిజం అభివృద్ధి పేరుతో భక్తుల మనోభావాలను కాలరాయడం సమజసం కాదన్నారు. దళిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పిడి విజయరావు మాట్లాడుతూ హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా ఎక్సైజ్‌శాఖ మంత్రి తీసుకునే నిర్ణయాలకు పోలీసులు, అధికారులు వత్తాసు పలకవద్దని హితవు పలికారు. 

పర్యాటక అభివృద్ధి పేరుతో నీటిపారుదల శాఖ భూమిని కబ్జా చేసేయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మండల పార్టీ అధ్యక్షుడు గురుజు బాలమురళీకృష్ణ, నాయకుడు ముదునూరి నాగరాజు పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. శ్రీనివాసపురం స్నానఘట్టానికి అడ్దంగా మట్టి గుట్టలు పోయడంపై స్ధానికులు మండిపడ్డారు. మత్య్సకారులతో పాటు స్థానికులు రోడ్డుపైకి చేరుకుని వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సుమారు గంటసేపు రోడ్డుపైనే వనితతో పాటు నాయకులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసు అధికారుల సూచనలతో స్నానఘట్టానికి అడ్డుగా వేసిన మట్టి గుట్టలు తొలగించడంతో పరిస్థితి చక్కబడింది. 

బుధవారం నీటిపారుదల శాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులతో చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తామని పట్టణ సీఐ ఎస్‌బీవీ శుభాకర్‌ హామీ ఇవ్వడంతో నాయకులు ఆందోళన విరమించారు. పార్టీ జిల్లా కార్యదర్శులు కొమ్మిరెడ్డి వెంకటేశ్వరరావు, కాకర్ల నారాయుడు, చాగల్లు, తాళ్లపూడి మండల పార్టీ అధ్యక్షులు కొఠారు అశోక్‌బాబా, కుంటముక్కల కేశవనారాయణ, పట్టణ అధ్యక్షుడు రుత్తల ఉదయ భాస్కరరావు, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి లకంసాని శ్రీనివాసరావు, కార్యదర్శి ముళ్లపూడి కాశీవిశ్వనాధ్, జిల్లా రైతు విభాగం నాయకులు గన్నిన రత్నాజీ, నాయకులు వర్రే శ్రీనివాస్, వరిగేటి సుధాకర్, కొయ్యల భాస్కరరావు, నగళ్లపాటి శ్రీనివాస్, చిలంకుర్తి బాబి లతో పాటు అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు