రెన్యూవల్ కష్టాలు

10 Nov, 2014 02:22 IST|Sakshi
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ రెన్యూవల్ దరఖాస్తుకు నేడు ఆఖరు
  •  లేనిపోని నిబంధనలు, తక్కువ గడువు ఇచ్చిన ప్రభుత్వం
  •  దరఖాస్తుకు దూరమైన వేలాదిమంది విద్యార్థులు
  • బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రెన్యూవల్ చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీ ఆఖరు కావడంతో విద్యార్థులు ఇబ్బందులుపడాల్సి వస్తోంది. కుల, ఆదాయ, స్థానికత ధ్రువీకరణ పత్రాల కోసం అవస్థలు పడుతున్నారు. రెన్యూవల్‌కు ప్రభుత్వం అక్టోబర్ 28 నుంచి నవంబర్ 10 వరకు మాత్రమే గడువు ఇచ్చింది. కుల ధ్రువీకరణ పత్రం పొందాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీ సేవా కేంద్రాల్లో కనీసం 15 రోజుల సమయం పడుతుంది.

    కాగా ప్రభుత్వం ఇచ్చిన సమయం కేవలం 14 రోజులు మాత్రమే. ఈ 14 రోజుల్లోనూ రెండు ఆదివారాలు, ఒక రెండో శనివారం, మొహర్రం పండుగ సెలవులు వచ్చాయి. ఇక మిగిలిన పది రోజుల్లో విద్యార్థులు ప్రభుత్వం కోరిన విధంగా అన్ని ధ్రువీకరణ పత్రాలతో ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది సందిగ్ధం. అలాగే ఫీజురీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులంతా జూన్ 2 తర్వాత మీ సేవా కేంద్రాల్లో పొందిన కుల, ఆదాయ, స్థానికత తదితర ధ్రువీకరణ పత్రాలను మాత్రమే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది.

    విద్యార్థుల ఆధార్‌తో పాటు తల్లిదండ్రుల ఆధార్‌కార్డులనూ అప్‌లోడ్ చేయాలనే నిబంధనా ఉంది. దీంతో అనేక మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోలేక దూరం కానున్నారు. రీయింబర్స్‌మెంట్ తేదీల ప్రతిపాదనలను గత నెల 27న ప్రభుత్వం అన్ని కళాశాలలకు పంపించింది.

    ఈ పాస్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అయితేఈ నోటీసులను సరైన సమయంలో విద్యార్థుల దృష్టికి తీసుకుపోవడంలో అనేక కళాశాలలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఆరోపణలున్నాయి. దీంతో జిల్లాలో మొత్తం 64,172 మంది రెన్యూవల్ విద్యార్థులకుగాను ఇప్పటి వరకు 12,661 మంది మాత్రమే రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.  కాస్త గడువు పెంచి, నిబంధనలు సడలిస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
     
     గడువు పెంచాలి
     ఫీజు రీయింబర్స్‌మెంట్ రెన్యూవల్ చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచాలి. దరఖాస్తు చేసుకునేందుకు అనేక నిబంధనలు విధించి అతి తక్కువ సమయం ఇస్తే ఎలా.  విద్యార్థులకు అన్యాయం చేసేందుకే ప్రభుత్వం ఈ విధమైన కుట్రలను పన్నుతోంది.
     - మహ్మద్ఫ్రీ బీటెక్, ద్వితీయ సంవత్సరం
     
     ఉన్నత విద్యను దూరం చేసేందుకే
     రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు ఇలాంటి ప్లాన్లు చేస్తోంది. అతి తక్కువ వ్యవధిలో దరఖాస్తు చేసుకోమంటే ఎలా సాధ్యమవుతుంది. అనేక మందికి ఆధార్‌కార్డులు లేక పోయినా, ఫీజుకు ఆధార్ లింకు పెట్టడం బాధాకరం.
     - జీవీ నాగేంద్ర, బీటెక్ ఫైనలియర్
     
     నిబంధనలను సడలించాలి
     ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం నిబంధనలను సడలించాలి. ముఖ్యంగా ఫీజుకు ఆధార్ లింకును తొలగించాలి. అలాగే జూన్ 2 తర్వాత మీ సేవా కేంద్రాల్లో తీసుకున్న కుల, ఆదాయ, స్థానికత సర్టిఫికెట్ల విషయంలో కూడా ప్రభుత్వం పునరాలోచించాలి.
     -  జీ శివశంకర్, బీటెక్ ఫైనలియర్
     

మరిన్ని వార్తలు