ప్రయి'వేటు'కరణ కుట్ర..!

29 Apr, 2019 10:48 IST|Sakshi

ఆర్టీసీలో అద్దె బస్సులు 22 నుంచి 35 శాతానికి పెంచేందుకు నిర్ణయం

జిల్లాకు 350 నుంచి 400 బస్సులు వచ్చే అవకాశం

తీవ్రంగా నష్టపోనున్న కార్మికులు

వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాల నాయకులు

ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రయివేటుపరం చేసేలా ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం మరో అడుగు ముందుకేశాయి. 22 శాతంగా ఉన్న అద్దె బస్సులను 35 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం అదేనని తెలుస్తోంది. అదేగనక జరిగితే కార్మికులు తీవ్రంగా నష్టపోనున్నారు. కష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించేందుకు తాము ప్రయత్నిస్తుంటే..  మరింత అగాథంలోకి నెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

తిరుపతి సిటీ : ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలతో ఆర్టీసీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 14 డిపోల్లో 1,420 బస్సులు ఉన్నాయి. ఇప్పటికే 22 శాతం అద్దె బస్సులకు అనుమతిచ్చారు. ఈ మేరకు 230 అద్దె బస్సులు వివిధ రూట్లలో సేవలు అందిస్తున్నాయి. 35 శాతం అద్దె బస్సులు ప్రవేశపెడితే జిల్లా వ్యాప్తంగా 350–400 అద్దె బస్సులు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.

వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు..
జిల్లా వ్యాప్తంగా 14 డిపోల్లో 400 మంది డ్రైవర్ల అవసరం కాగా, ప్రస్తుతం ఉన్నవారిపైనే అదనపు పనిభారం పెంచి డ్యూటీలు చేయిస్తున్నారు. కార్మికులకు సరైన విశ్రాంతి లేక జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే తెలుగువెలుగు బస్సులను సగానికి పైగా రద్దుచేసి, వాటి స్థానంలో ప్రయివేట్‌ బస్సులను ప్రోత్సహించారు. దీంతో 22 శాతం ఉన్న అద్దె బస్సులను 35 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని ఎంప్లాయీస్‌ యూనియన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అద్దె బస్సుల వల్ల ఆర్టీసీలో పనిచేసే కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. అద్దె బస్సుల్లో పనిచేసే ప్రవేట్‌ సిబ్బందికి బాధ్యత ఉండదనే విషయం ఆర్టీసీ యాజమాన్యం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అద్దె బస్సుల కాలపరిమితి ముగిసిన వెంటనే అద్దె బస్సులను దశలవారీగా తొలగించి వాటి స్థానంలో ఆర్టీసీ బస్సులను నడిపేందుకు గతంలో ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులతో యాజమాన్యం సమావేశమైనప్పుడు అంగీకరించిందనే విషయం యాజమాన్యం మరచినట్లు ఉందని ఈయూ నాయకులు చెబుతున్నారు. ఒక్కో అద్దె బస్సు వల్ల జిల్లాలో అయిదున్నర మంది కార్మికులు రానున్న రోజుల్లో కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యజమాన్యం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని కోరుతున్నారు.

అద్దె బస్సులు పెంచితే ఉద్యమమే..
జిల్లాలో 35 శాతానికి అద్దె బస్సులను పెంచితే ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతాం. దీనివల్ల జిల్లాలో కార్మికుల సంఖ్య క్రమేణ తగ్గిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర విభజన సమయంలో 12,500 ఆర్టీసీ బస్సులుండగా, ప్రస్తుతం 11వేల బస్సులతో నడిపే దుస్థితి ఏర్పడింది. జిల్లాలో 9,350 మంది సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం 8వేల మంది మాత్రమే ఉన్నారు. గత అయిదేళ్లుగా ఆర్టీసీలో ఎలాంటి ఉద్యోగ నియామకాలు జరపలేదు. ఇప్పటికైనా యాజమాన్యం అనాలోచిత నిర్ణయాలు విరమించుకోవాలి. ప్రభుత్వంతో కలిసి కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాలి.
– టి.సత్యనారాయణ,రీజనల్‌ కార్యదర్శి, ఎంప్లాయీస్‌ యూనియన్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా