కంటతడి పెట్టిన రేణూదేశాయ్‌

26 Feb, 2019 03:08 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న రైతు బోయ రామయ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్న రేణుదేశాయ్‌

అన్నదాతల ఉసురు తప్పకుండా తగులుతుంది

ఆలూరు/పెద్దకడబూరు: అప్పుల బాధ తాళలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అన్నదాతల ఉసురు తప్పకుండా తగులుతుందని సామాజిక వేత్త, సినీనటి రేణు దేశాయ్‌ అన్నారు. రాష్ట్రంలో ‘కరువు నేపథ్యంలో రైతుల కష్టాలు.. ఆత్మహత్యలకు దారి తీస్తున్న పరిస్థితుల’పై అధ్యయనం చేయడంలో భాగంగా ఆమె సోమవారం కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుంబళబీడు, మండల కేంద్రమైన పెద్దకడబూరులో పర్యటించారు. తంబళబీడు గ్రామంలో గత ఏడాది ఆగస్టు 25న అప్పుల బాధ తాళలేక రైతు దంపతులు నెరణికి బోయరామయ్య, వండ్రమ్మ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోగా..వారి కుటుంబ సభ్యులను రేణుదేశాయ్‌ పరామర్శించారు. అలాగే పెద్దకడబూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు పెద్దరంగన్న కుటుంబ సభ్యులతోనూ ఆమె  మాట్లాడారు. వారు చెప్పింది విని ఆమె కంట తడిపెట్టారు. ఆయా గ్రామాల్లో రచ్చబండపై రైతులతో ‘సాక్షి టీవీ’ ఆధ్వర్యంలో ముఖాముఖి నిర్వహించారు.

తుంబళబీడు గ్రామస్తులు మాట్లాడుతూ పక్కా గృహాలు లేవని, తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, రోడ్లు బాగోలేవని, పంటలకు జింకల బెడద అధికంగా ఉందని, పంటలు పండక బ్యాంకుల్లో తెచ్చుకున్న రుణాలను చెల్లించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దకడబూరులో రైతులు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో కరువే దిక్కయ్యిందని, పంటలు పండడం లేదని, ఒకవేళ పండినా గిట్టుబాటు ధరలు లేవని వాపోయారు. పత్తి క్వింటాల్‌ రూ.3,500, మిరప క్వింటాల్‌ రూ.6 వేలకు మించి పలకడం లేదన్నారు. కాగా తాను ప్రజాప్రతినిధిని కానని, ప్రభుత్వ అధికారిణిని కాదని, అయినప్పటికీ ప్రభుత్వం, కలెక్టర్‌ దృష్టికి  రైతుల సమస్యలు తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని రేణుదేశాయ్‌ చెప్పారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా