ఎవరెస్టు అధిరోహణకు రేణుక పయనం

24 Mar, 2018 12:24 IST|Sakshi
రేణుక

సీతంపేట: ఎవరెస్టు శిఖర అధిరోహణకు కొండగొర్రె రేణుక అనే గిరిజన విద్యార్థిని శుక్రవారం తన స్వగ్రామమైన భామిని మండలం నులకజోడు నుంచి పయనమై వెళ్లింది. పది రోజుల పాటు విజయవాడలోని కేతాని కొండ వద్ద శిక్షణ అనంతరం మరో పది రోజులు లడక్‌లో మంచు పర్వతాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తదుపరి 20 రోజుల తర్వాత ఎవరెస్టు అధిరోహణకు వెళ్లనున్నారు. రేణుక ఎవరెస్టు ఎక్కితే జిల్లా నుంచి ఊయక కృష్ణారావు తర్వాత అధిరోహించిన రెండో గిరిజన విద్యార్థినిగా గుర్తింపు దక్కుతుంది. ఈమె సీతంపేట గిరిజన బాలికల గురుకుల కళాశాలలో వృత్తివిద్యాకోర్సు ( అక్కౌంట్స్‌ అండ్‌ ట్యాక్సేషన్‌) గ్రూపు ద్వితీయ సంవత్సరం పబ్లిక్‌ పరీక్షలు రాసింది. ఇప్పటికే 6,620 మీటర్ల ఎత్తయిన రినాక్‌ పర్వతశిఖరాన్ని అధిరోహించింది.

8,848 మీటర్ల ఎత్తున్న ఎవరెస్టు శిఖరాగ్రాన చేరుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. తల్లిదండ్రులు సంజీవరావు, కృష్ణవేణిలు కొండపోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తుంటారు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం వారిది. అన్నయ్య గణపతి పదో తరగతి వరకు చదివి డ్రాపౌట్‌ అయ్యాడు. మరో అన్నయ్య సంతోష్‌ సీతంపేటలో ఐటీఐ చేస్తున్నాడు. ప్రాథమిక విద్యాబ్యాసం స్వగ్రామంలో పూర్తి చేసి, ఐదు నుంచి పదోతరగతి వరకు హడ్డుబంగి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పూర్తి చేసింది. ఇంటర్మీడియట్‌ సీతంపేట బాలికల కళాశాలలో చేరింది. గురుకుల సొసైటీ ఇచ్చిన పర్వతారోహణ శిక్షణ అందిపుచ్చుకుంది.

మరిన్ని వార్తలు