నేటి నుంచి మార్కెట్‌ యార్డుల పునఃప్రారంభం 

31 Mar, 2020 03:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి:  గుంటూరు మిర్చి యార్డు మినహా రాష్ట్రంలోని అన్ని మార్కెట్‌యార్డులు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్దులు మూసివేయడంతో కొన్ని రకాల నిత్యవసర వస్తువుల కొరత ఏర్పడే పరిస్థితులొచ్చాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌యార్డులను ప్రారంభించి వాటిని ధరలను నియంత్రించాలని అధికారులు చర్యలు చేపట్టారు. మార్కెట్‌ యార్డులను పునఃప్రారంభించాలని సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో జిల్లాల అధికారులను మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్‌ ప్రద్యుమ్న ఆదేశించారు.  

రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా కందిపప్పు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో కందికీ కొరత వచ్చే అవకాశం ఉండటంతో కందుల కొనుగోలుపైనా ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు.  
రాయలసీమ జిల్లాల్లో కందులు, పప్పుశనగ నిల్వలు అధికంగా ఉన్నాయని, మార్కెట్‌యార్డులను ప్రారంభించిన వెంటనే రైతులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.   
మార్కెట్‌యార్డుల్లో రైతులు, హమాలీలు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
మిర్చి యార్డులకు సంబంధించి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నందున ఉన్నతస్థాయి సమావేశం జరిగాక వీటి ప్రారంభంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రద్యుమ్న వెల్లడించారు.  

మరిన్ని వార్తలు