ఎన్నాళ్లీ తిప్పలు

25 Aug, 2018 13:22 IST|Sakshi
నరసాపురం సబ్‌డివిజన్‌ పోలీస్‌ కార్యాలయం

ఊరు ఓ మండలంలో.. పోలీస్‌స్టేషన్‌ మరో మండలంలో

కేసు ఒక స్టేషన్‌లో.. పంచనామా మరో చోట

ఇదీ నరసాపురం పోలీస్‌ సబ్‌ డివిజన్‌లో పరిస్థితి

పునర్‌వ్యవస్థీకరణకు నోచుకోని పోలీస్‌స్టేషన్లు

పీఎం లంక, ఎల్బీ చర్ల నరసాపురం మండలంలోని గ్రామాలు. ఈ గ్రామాల్లో ఏదైనా సమస్య ఎదురై పోలీస్‌స్టేషన్‌కి వెళ్లాలంటేనరసాపురం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కి కాకుండా 18 కిలోమీటర్ల దూరంలోని మొగల్తూరు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లాల్సి ఉంది.

పశ్చిమగోదావరి,నరసాపురం: ఏదైనా సమస్య ఎదురైతే సొంత మండలంలోని పోలీస్‌స్టేషన్‌ కాకుండా దూరంగా ఉన్న వేరే మండలంలోని పోలీస్‌స్టేషన్‌కి ఆయా గ్రామాల ప్రజలు వెళ్లాల్సి వస్తోంది. ఇదీ నరసాపురం పోలీస్‌ సబ్‌డివిజన్‌లో పరిస్థితి. సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోలీస్‌స్టేషన్ల పరిధిల్లో మార్పులు చేపట్టకపోవడంతో ప్రజలే కాకుండా, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్య ఉన్నా కూడా పోలీస్‌శాఖ పట్టించుకోకపోవడం విశేషం.

సబ్‌ డివిజన్‌లో 19 పోలీస్‌స్టేషన్లు
నరసాపురం సబ్‌ డివిజన్‌ పరిధిలో ఆరు సర్కిల్‌ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో మొత్తం 19 పోలీస్‌ స్టేషన్లున్నాయి. నరసాపురం పట్టణం, రూరల్, మొగల్తూరు, పాలకొల్లు, పాలకొల్లు రూరల్, ఆచంట, పోడూరు, యలమంచిలి, వీరవాసరం, పెనుగొండ, ఇరగవరం, పెనుమంట్ర, భీమవరం 1 టౌన్, భీమవరం 2 టౌన్, భీమవరం రూరల్, ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు పోలీస్‌ స్టేషన్లు పనిచేస్తున్నాయి. ప్రధాన సమస్య ఏమిటంటే నరసాపురం రూరల్, మొగల్తూరు, పాలకొల్లు రూరల్, భీమవరం రూరల్‌ ప్రాంతాల పోలీస్‌ స్టేషన్‌ల పరిధి స్టేషన్‌లు ఏర్పాటు చేసిన నాటి నుంచి పాలనా పరమైన ఇబ్బందులతో పోలీస్‌ సిబ్బంది సతమతమవుతున్నారు. దీంతో పాటు ఫిర్యాదుదారులు అనేక అవస్థలు పడుతున్నారు.

నరసాపురం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మత్స్యపురి, తుందుర్రు గ్రామాలు నరసాపురం మండల పరిధిలోకి రావు. తుందుర్రు భీమవరం మండల పరిధిలో ఉండగా, మత్స్యపురి గ్రామం వీరవాసరం మండలంలోనిది. అలాగే నరసాపురం రూరల్‌ మండలంలోని ఎల్‌బీ చర్ల, పసలదీవి, తూర్పుతాళ్లు, పెదమైనవానిలంక  గ్రామాలు ప్రస్తుతం మొగల్తూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్నాయి. దీనివల్ల పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే భీమవరం మండలానికి చెందిన వెంప గ్రామం ప్రస్తుతం మొగల్తూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉంది. దీనివల్ల అటు పోలీస్‌ సిబ్బంది, ఇటు కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే తణుకు మండలానికి చెందిన రెండు గ్రామాలు ఇరగవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వచ్చాయి. పాలకొల్లు మండలానికి చెందిన అడవిపాలెం పోడూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉంది.

అమలుకు నోచుకోని ప్రభుత్వ నిర్ణయం
ఏ మండలంలోని గ్రామాలు ఆయా మండలాల పోలీస్‌స్టేషన్ల పరిధిలోనే ఉండేలా చర్యలు చేపట్టాలని 2008లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం ఆలోచన ఇంతవరకూ అమలు కాలేదు. ఈలోపు రాష్ట్ర విభజన కూడా జరిగిపోయింది. అలాగే గతంలో డీఎస్పీలుగా పని చేసిన అనేకమంది అధికారులు ఇక్కడ పడుతున్న ఇబ్బందులను, స్టేషన్ల పరిధిల్లో మార్పులు చేయాల్సిన అవసరాన్ని వివరిస్తూ ఉన్నతాధి కారులకు లేఖలు రాశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో ఈ పోలీస్‌స్టేషన్ల పరిధిలో నేరాలు జరిగితే కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణకు, శవ పంచనామాకు మరో మండలానికి చెందిన రెవెన్యూ అధికారులపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో పాటు ఫిర్యాదుదారులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాక సంబంధిత కీలక రెవెన్యూ పత్రాలను ఆయా మండల కేంద్రాలకు వెళ్లి తిరిగి తమ ప్రాంత  పోలీస్‌స్టేషన్‌ అధికారులకు అందించాల్సి వస్తోంది. ప్రతి నియోజక వర్గానికి ఓ సర్కిల్‌ కార్యాలయం ఉండేలా స్టేషన్లను పునర్‌ వ్యవస్థీకరించాలని నాలుగేళ్ల క్రితం పోలీస్‌శాఖ నిర్ణయించింది. అయితే ప్రభుత్వం నుంచి ఆమోదం రాకపోవడంతో ఫైల్‌ పెండింగ్‌లోనే ఉంది. ఇప్పటికైనా స్టేషన్‌ పరిధిల్లో మార్పులు అంశాన్ని పరిశీలించాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు