సరికొత్త ‘పట్టణం’

27 Sep, 2019 13:09 IST|Sakshi

సమాన ఓటర్లు.. సమాన ప్రాతినిధ్యం

పట్టణాల్లో పూర్తయిన వార్డుల పునర్విభజన ప్రక్రియ

ప్రభుత్వానికి ముసాయిదా జాబితా

అక్టోబరు 10న తుది నోటిఫికేషన్‌

తూర్పుగోదావరి ,మండపేట: పట్టణ ప్రాంతాలు త్వరలో సరికొత్త రూపును సంతరించుకోనున్నాయి. వార్డుల్లోని వ్యత్యాసాలను సరిచేసి అభివృద్ధి ఫలాలను అక్కడి ప్రజలందరికీ చేరువ చేసేం దుకు ప్రభుత్వం చేపట్టిన వార్డుల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ముసాయిదా జాబితాను జిల్లాలోని పురపాలక సంస్థలు, నగర పంచాయతీలు ప్రభుత్వానికి నివేదించాయి. పరిశీలన అనంతరం అక్టోబరు పదో తేదీన తుది నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఇకపై వార్డుల్లోనిప్రజాప్రతినిధులకు సమాన ప్రాతినిధ్యం దక్కనుంది. జిల్లాలో రెండు నగర పాలక సంస్థలు, ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీలుండగా, కార్పొరేషన్ల పరిధిలో 100 డివిజన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల పరిధిలో 264 వార్డులున్నాయి. జిల్లాలో స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉన్న రాజమహేంద్రవరం కార్పొరేషన్‌తోపాటు మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో వార్డుల వారీగా ఇప్పటికే అధికారులు ఓటరు జాబితాలను సిద్ధం చేశారు. ఒక్కో వార్డులో ఓటర్లు, జనాభా వివరాల్లో అధిక వ్యత్యాసం ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఒక వార్డులో నాలుగు వేల వరకు జనాభా ఉంటే, ఒక వార్డులో రెండు వేలు మాత్రమే ఉన్నాయి.

తక్కువ జనాభా ఉన్న వార్డులతో పోలిస్తే అధిక జనాభా ఉన్న వార్డుల్లో పనిభారం అధికంగా ఉండటంతోపాటు పథకాల అమలులో తాత్సారం, పాలనాపరమైన సమస్యలకు ‘చెక్‌’ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని వార్డుల్లోను సమాన జనాభా ఉండే విధంగా 2011 జనాభా ప్రాతిపదికన వార్డుల పునర్విభజన చేయాలని కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ) ఆదేశాలిచ్చింది. వార్డుల్లోని జనాభా సమానంగా ఉండాలి. 10 శాతం హెచ్చతగ్గులు ఉండవచ్చు. ప్రస్తుత వార్డు జనాభాలో వ్యత్యాసం అంతకన్నా ఎక్కువగా ఉంటే వ్యత్యాసం ఉన్న జనాభాను సమీప వార్డుల్లో కలపాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్లు, ముమ్మిడివరం నగరపంచాయతీ మినహా మిగిలిన మండపేట, అమలాపురం, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, రామచంద్రపురం, తుని మున్సిపాల్టీలు, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీలు వార్డుల పునర్విభజన నిమిత్తం గత నెలలో అధికారులకు ఆదేశాలందాయి. కాకినాడ కార్పొరేషన్‌లో ఇప్పటికే ఎన్నికలు జరగ్గా, రాజమహేంద్రవరం కార్పొరేషన్, ముమ్మిడివరం నగర పంచాయతీ లేకపోవడంతో వాటిలో సమీప గ్రామాల విలీన ప్రతిపాదన ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు.

ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు 2011 జనాభా ప్రాతిపదికన అధికారులు జిల్లాలోని పురపాలక సంస్థలు, నగర పంచాయతీల వార్డుల పరిధిలో జనాభాను సమానం చేశారు. ప్రజల నుంచి అభ్యంతరాలు, పరిశీలన తదితర ప్రక్రియలను పూర్తి చేసి ముసాయిదా జాబితాను ఈ నెల 18వ తేదీన సీడీఎంఏకు నివేదించారు. పరిశీలన అనంతరం అక్టోబర్‌ 10వ తేదీన ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.

మరిన్ని వార్తలు