కీలక శాఖల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీ

24 May, 2017 01:48 IST|Sakshi
కీలక శాఖల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీ

2 వేల మందిని నియమిస్తామన్న సీఎం

సాక్షి, అమరావతి: అన్ని ముఖ్యమైన శాఖల్లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయ డానికి త్వరలో 2 వేల గ్రూప్‌–1, గ్రూప్‌–2 నియామకాలు జరుపుతామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో చేపడుతు న్న పనులపై సీఎం మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వివరాలను సీఎం కార్యాలయం విడుదల చేసింది. సాధ్యమైనంత త్వరలో ఈ నియామకాలు జరుపుతామని అందులో పేర్కొన్నారు. ప్రజలందరికీ మంచినీటి వసతి కల్పించేందుకు వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం దాని స్థానంలో ప్రత్యేక తాగునీటి సరఫరా సంస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తు న్నట్టు తాజా సమావేశంలో తెలిపారు.

ఈ నెలలో జరిగే కలెక్టర్ల సమావేశంలో దీనిపై తుదినిర్ణయం తీసుకుంటామన్నారు. భూవివాదాల పరిష్కారానికి భూసేవ పేరుతో త్వరలో ల్యాండ్‌హబ్‌ ప్రాజెక్టు ఏర్పాటు కానుందని సీఎం తెలిపారు. ప్రతీ స్థలానికి, పొలానికి భూధార్‌ పేరుతో యునిక్‌ ఐడీ నంబర్‌ను కేటాయిస్తామని చెప్పారు. దీనిని పైలట్‌ ప్రాజెక్టుగా ఒక మున్సిపాలిటీ, ఒక మండలంలో అమలు చేసి పరిశీలించాలని సూచించారు.

మరిన్ని వార్తలు