'చల్లా'రని సెగ! 

13 Apr, 2018 11:09 IST|Sakshi

నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో అసంతృప్తి 

కడప రీజియన్‌ ఆర్టీసీ చైర్మన్‌ పదవిని తిరస్కరించిన చల్లా రామకృష్ణా రెడ్డి  

ఎమ్మెల్సీ ఇవ్వకుండా మోసం చేశారని అధిష్టానంపై మండిపాటు 

తనను పరిగణనలోకి తీసుకోలేదని ఏవీ సుబ్బారెడ్డి కినుక 

నామినేటెడ్‌ పోస్టుల భర్తీ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో సెగలు రేపుతోంది. సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణా రెడ్డికి కడప రీజియన్‌ ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇచ్చారు. అయితే ఆ పదవి వద్దని ఆయన తేల్చిచెప్పారు. టీడీపీలో చేరిన సమయంలో తనకు ఎమ్మెల్సీ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చి విస్మరించిందని   మండిపడుతున్నారు. ఇన్ని రోజులుగా పార్టీని అంటిపెట్టుకున్న తనను ఈ విధంగా అవమానిస్తారా అని వాపోతున్నారు.  

సాక్షి ప్రతినిధి, కర్నూలు : టీడీపీ అధిష్టానంపై ఆ పార్టీ నేతలు తిరుగుబావుటా ఎగుర వేస్తున్నారు. ఇన్నాళ్లు వాడుకొని  వదిలేస్తారా అని మండిపడుతున్నారు. నామినేటెడ్‌ పోస్టుల వ్యవహారం ఇందుకు వేదికగా మారింది.  2014లో పామర్రు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వర్ల రామయ్యకు ఆర్టీసీ రాష్ట్రస్థాయి చైర్మన్‌ పోస్టు ఇచ్చి...1983లో ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసినతనకు రీజియన్‌ స్థాయి పోస్టు ఇవ్వడం ఏమిటని చల్లా రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డి కూడా నామినేటెడ్‌ పోస్టును ఆశించారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ చైర్మన్‌ పోస్టును ఇస్తామని కూడా ఆయనకు టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత నామినేటెడ్‌ పోస్టుల్లో స్థానం దక్కకపోవడంపై ఏవీ కినుక వహించారు.  
పెరుగుతున్న విభేదాలు.. 
కర్నూలులో ఎంపీ టీజీ, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆళ్లగడ్డలో మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, ఫరూఖ్‌ కుమారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బనగానపల్లెలో ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి, చల్లా రామకృష్ణా రెడ్డి, కోడుమూరులో విష్ణు, కొత్తకోట వర్గాలకు పొసగడం లేదు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి, తుగ్గలి నాగేంద్రల మధ్య కూడా విభేదాలు పొడచూపాయి. బహిరంగ వేదికల మీద వీరు పరస్పరం విమర్శలు కూడా చేసుకుంటున్నారు.  ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి వైఖరిపై పార్టీలోని అనేక మంది నేతలు అసంతృప్తితో ఉన్నారు.  పాణ్యం నియోజకవర్గంలో కూడా ఇన్‌చార్జీ ఏరాసు ప్రతాపరెడ్డి వైఖరిపై పార్టీ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు.  శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ కనీసం కార్యకర్తలకు పనులు ఇవ్వకుండా సొంతానికి చేసుకుంటుండంపై ఆ పార్టీ నేతలు కుమిలిపోతున్నారు.  
ఇన్‌చార్జ్‌ మంత్రిపై అసహనం..  జిల్లాలో విభేదాలు పెరిగిపోవడం..అసంతృప్తులు ఎక్కువగా ఉండడంతో ఇన్‌చార్జ్‌ మంత్రి కాల్వ శ్రీనివాసులుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో జిల్లాకు చెందిన పార్టీ నేతలతో గురువారం జరిగిన సమావేశంలో ఇన్‌చార్జ్‌ మంత్రిగా కాల్వ శ్రీనివాసులు పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలను ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ నేతలు ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదని మంత్రిని నిలదీశారు. అదేవిధంగా మంత్రి అఖిలప్రియ వైఖరితో పాటు నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని కూడా సీఎం మందలించినట్టు సమాచారం. సీనియర్‌ పార్టీ నేతలను కలుపుకుని పోవడంతో పూర్తిగా విఫలమయ్యారని స్పష్టం చేసినట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు.  

మరిన్ని వార్తలు