ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్‌ 

15 May, 2019 18:44 IST|Sakshi

తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌కే రుడోలా నోట్‌ విడుదల చేశారు. ఈ నెల 19న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో(అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు) రీపోలింగ్‌ జరగనుంది.321-ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, 104- పులివర్తి వారి పల్లి, 316- కొత్త ఖండ్రిగ, 318-కమ్మపల్లి, 313-వెంకట రామాపురం పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందని వెల్లడించింది.

దళితులను ఓట్లు వేయకుండా అడ్డుకోవడంతో..
చంద్రగిరిలో పోలింగ్‌ రోజు ఐదుచోట్ల అవకతవకలు జరిగాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. దళితులను ఓట్లు వేయకుండా అడ్డుకుని పోలింగ్‌ బూత్‌ను స్వాధీనం చేసుకున్నారని ఆయన ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీసీ కెమెరాలు పరిశీలించి న్యాయం చేయాలని చెవిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై పది రోజుల క్రితం కలెక్టర్‌ ప్రద్యుమ్నని ఈసీ నివేదిక కోరారు. కలెక్టర్‌ నివేదికతో పాటు పంపిన సీసీ కెమెరా పుటేజీతో వాస్తవాలు వెలుగు చూశాయి.

అక్రమాలు జరిగినట్లు తేలటంతో కలెక్టర్‌ ప్రద్యుమ్న పంపిన నివేదికను ఏపీ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదీ, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. వాటిని పరిశీలించి ధృవీకరించుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 19న ఐదు చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని నిశ్చయించుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి రీపోలింగ్‌ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఐదు చోట్ల అవకతవకలకు పాల్పడ్డ పోలింగ్‌ సిబ్బందిపై వేటు పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు