గాడిదల బహిరంగ వధపై నివేదిక ఇవ్వండి

15 Nov, 2017 10:32 IST|Sakshi

క్షేత్రస్థాయి పరిశీలనకు ఓ న్యాయాధికారిని పంపండి

గుంటూరు జిల్లా జడ్జికి హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌ : గుంటూరు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కబేళా విషయంలో నిజానిజాలను తేల్చేందుకు ఓ న్యాయాధికారిని నియమించాలని ఉమ్మడి హైకోర్టు నిర్ణయించింది. వాస్తవాలను పరిశీ లించి నివేదిక ఇచ్చేందుకు వీలుగా న్యాయాధికారిని క్షేత్రస్థాయికి పంపాలని గుంటూరు జిల్లా జడ్జిని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరులో నిబంధనలకు విరుద్దంగా కబేళా నిర్వహించడమే కాక, గాడిదలను బహిరంగంగా వధిస్తూ, వాటి మాంసాన్ని విక్రయిస్తు న్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కాకినాడకు చెందిన యానిమల్‌ రెస్క్యూ ఆర్గనైజేషన్‌ కార్యదర్శి ఎస్‌.గోపాల్‌రావు, మరో ముగ్గురు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం పై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం దానిని మరోసారి విచారించింది. 

ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, గుంటూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబేళాను 2014లోనే మూసివేయడం జరిగిందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఇది నిజమేనా? అంటూ ప్రశ్నించింది. దీనిని రికార్డు చేసి, క్షేత్రస్థాయి నుంచి వాస్తవాలు తెలుసుకుంటామంది. తప్పని తేలితే కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. తరువాత పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, కబేళా వెలుపల గాడిదలను బహిరంగంగానే వధిస్తున్నారని కోర్టుకు నివేదించారు. మాంసం విక్రయాలను కూడా అక్కడే జరుపుతున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, క్షేత్రస్థాయికి ఓ న్యాయాధికారిని పంపి వాస్తవాలు తెలుసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఓ న్యాయాధికారిని పంపి వాస్తవాలపై ఓ నివేదిక సమర్పించాలని గుంటూరు జిల్లా జడ్జిని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

>
మరిన్ని వార్తలు