15 రోజుల్లో ప్రభుత్వ భూములపై నివేదన

20 Feb, 2016 23:34 IST|Sakshi

విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ శాఖ భూముల వివరాలను సర్వే చేసి పూర్తి స్థాయి నివేదికను 15 రోజుల్లో నివేదించాలని జాయింట్ కలెక్టర్ శ్రీకేశ్ బి లట్కర్ తహసిల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం తహశీల్దార్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ శాఖల భూముల రికార్డుల్లో తప్పొప్పులున్న సందర్భాల్లో వాటిని సమగ్రంగా సర్వే చేసి నివేదికను పొందుపరచాలన్నారు.
 
 పలు దరఖాస్తులను ఇప్పటికే పరిశీలించి ఉన్నప్పటికీ మరోసారి వాటిని సవరణలుంటే సర్వే రిపోర్టు ఆధారంగా పక్కా నివేదిక తయారు చేయాలన్నారు. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఎంతమేర ఉన్నాయో గుర్తించి నివేదించాలన్నారు. ఇందుకోసం ఆయా మండలాల సర్వేయర్లను అప్రమత్తం చేయాలన్నారు. ప్రభుత్వ భూముల సరిహద్దులు, సర్వే నెంబర్లు పక్కాగా ఉండాలన్నారు. ఆలస్యమయితే ఉపేక్షించేది లేదన్నారు. సమావేశంలో డీఆర్వో మారిశెట్టి జితేంద్ర, జిల్లాలోని తహసిల్దార్లు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు