గ్యాస్‌ లీక్‌.. ఆ వదంతులు నమ్మొద్దు

7 May, 2020 13:40 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో రెండోసారి గ్యాస్‌ లీక్‌ అయినట్టు వచ్చిన వార్తలను ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు కొట్టిపారేశారు. ఆ వదంతులు అన్ని అవాస్తవమని చెప్పారు. ఈ మేరకు ఏపీ పోలీసు ట్విటర్‌ ఖాతాలో ఓ మెసేజ్‌ పోస్ట్‌చేశారు. పరిశ్రమలో మెయింటెనెన్స్‌ టీమ్‌ మరమ్మతులు చేస్తోందని చెప్పారు. ఇప్పటికే కొంత ఆవిరిని బయటకు పంపించారని.. అక్కడ రెండో సారి ఎటువంటి గ్యాస్‌ లీక్‌ జరగలేదని స్పష్టం చేశారు. (చదవండి : విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం)

మరోవైపు ఎల్‌జీ పాలిమర్స్‌లో రెండోసారి గ్యాస్‌ లీక్‌ అయిందని వదంతులను నమ్మవద్దని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమను సందర్శించిన అనంతరం మంత్రి అవంతి మీడియాతో మాట్లాడారు.. కంపెనీలో గ్యాస్‌ లీక్‌ పూర్తిగా అదుపులోకి వచ్చిందని తెలిపారు. ఆర్‌ఆర్‌ వెంకటాపు, బీసీ కాలనీల్లోని ప్రజలు సమీప శిబిరాల్లో క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. ఎల్‌జీ పాలిమర్స్‌ పరిసరాల్లో మినహాయిస్తే విశాఖలోని ఇతర ప్రాంత ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కాగా, గురువారం తెల్లవారుజామున ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో రసాయన వాయువు లీక్‌ అయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందగా.. దాదాపు 200 మంది అస్వస్థతకు లోనయ్యారు.(చదవండి : గ్యాస్‌ లీక్‌ ప్రమాదంపై ప్రముఖుల దిగ్భ్రాంతి..)

మరిన్ని వార్తలు