మీడియా ప్రతినిధులపై పోలీసుల దౌర్జన్యం

17 Oct, 2015 02:15 IST|Sakshi

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు దౌర్జన్యంచేశారు. ఇంద్రకీలాద్రి కింద నుంచి వృద్ధులు, వికలాంగులను పైకి తీసుకొచ్చేందుకు దేవస్థానం లిఫ్టు ఏర్పాటు చేసింది. ఈ లిఫ్టు వద్ద తుని సీఐ ఒ.చెన్నకేశవరావుతో పాటు కొంతమంది పోలీసులు విధులు నిర్వహిస్తూ పోలీసు కుటుంబాలు, వీఐపీల కుటుంబాలను తప్ప మిగిలిన వారిని లిఫ్ట్‌లోకి అనుమతించని విషయం తెలుసుకున్న ఒక మీడియా ప్రతినిధి కె.పూర్ణ, వీడియో జర్నలిస్టు రమేష్, మరో రిపోర్టర్ చైతన్య అక్కడకు వెళ్లారు. లిఫ్టులో వచ్చే, వెళ్లే వారిని వీడియో రికార్డింగ్ చేస్తుండటంతో పూర్ణాతో  చెన్నకేశవరావు వాగ్వివాదానికి దిగారు.

తాను చానల్ ప్రతినిధినని, ఐడెంటిటీ కార్డు చూపించినా కెమెరా, సెల్‌ఫోన్లను లాక్కున్నారు. ఫోన్లు ఇచ్చివేయాలని విలేకరులు గట్టిగా కోరడంతో దాడికిదిగి పూర్ణా మెడపై తీవ్రంగా గాయపరిచారు. అక్కడే  ఉన్న పోలీసులు ఆ వెంటనే మీడియా ప్రతినిధులపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. చైతన్య తప్పించుకుని మీడియా పాయింట్ వద్ద ఉన్న మిగిలిన విలేకరులకు వద్దకు వచ్చి దాడి విషయం చెప్పాడు. విలేకరులు  వెళ్లి పోలీసులను ప్రశ్నిం చగా, వీడియో తీయడం ఆపి, రికార్డయిన దృశ్యాలను తొలగించమంటే  పట్టించుకోలేదని ఎదురు దాడికి దిగారు. పూర్ణాతో జరిగిన తోపులాటలో తన కాలికి గాయం అయిందంటూ చెన్నకేశవరావు బుకాయించడానికి ప్రయత్నిం చారు. అనంతరం విలేకరులు మీడియా పాయింట్ వద్దకు వచ్చి ధర్నాకు దిగారు. కొద్దిసేపటికీ ఏసీపీ ఎ.వి.ఎన్.శివరామ్, డీసీపీ కాళీదాస్ రంగరావు వచ్చి చెన్నకేశవరావు వద్ద ఉన్న పూర్ణా, చైతన్య సెల్‌ఫోన్లను వారికి ఇప్పించారు. అయితే  వివాదానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు తొలగించారని పూర్ణా డీసీపీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ కాళిదాసు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

 మంత్రి రావెల ప్రెస్‌మీట్ బహిష్కరణ
 సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి రావెల కిషోర్‌బాబు వచ్చి మీడియా ప్రతినిధులతో మాట్లాడబోగా విలేకరులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆయనకు తీవ్ర నిరసన తెలిపి సమావేశాన్ని బహిష్కరించారు. సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కలిసి దాడి ఘటనపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
 

మరిన్ని వార్తలు