సర్వం సిద్ధం

25 Jan, 2015 01:26 IST|Sakshi
సర్వం సిద్ధం

రిపబ్లిక్ డే వేడుకలకు నగరం ముస్తాబు.. నేడు గవర్నర్, సీఎం రాక
 
ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా ఏర్పాట్లు
సందర్శకులు ఉదయం 7గంటలకు రావాలి
విద్యుత్ దీపాలతో పలు కూడళ్లకు
అలంకరణ.. ప్రకాశం బ్యారేజీకి కొత్త కళ
 

విజయవాడ : నగరం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా సోమవారం నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవానికి ముస్తాబైంది. ఈ వేడుకలను బందరురోడ్డులోని      ఇందిరాగాంధీ స్టేడియంలో అంగరంగవైభవంగా నిర్వహించేందుకు అధికారయంత్రాంగం ఏర్పాట్లుచేసింది. శనివారం స్టేడియంలో ఫుల్‌డ్రెస్డ్ రిహార్సల్స్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీజీపీ జేవీ రాముడు పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లను బెటాలియన్స్ డీజీ గౌతంసవాంగ్ పరిశీలిస్తున్నారు. గవర్నర్ నరసింహన్, సీఎం చద్రబాబు, పలువురు మంత్రులు, ముఖ్య అధికారులు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. గవర్నర్ ఇక్కడ ఉదయం 7.15 గంటలకు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం 9గంటల సమయంలో హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం తగిన ఏర్పాట్లుచేశారు. గవర్నర్ జెండా ఆవిష్కరించి ప్రసంగించిన తర్వాత పోలీసులు పలు విన్యాసాలు ప్రదర్శించనున్నారు. ఈ వేడుకల్లో ప్రదర్శించేందుకు తొమ్మిది శాఖలు తమ శకటాలను సిద్ధంచేశాయి.

విద్యుద్దీపాలతో ప్రత్యేక అలంకరణ

వేడుకలు జరిగే ఇందిరాగాంధీ స్టేడియంతోపాటు నగరంలోని ముఖ్య కూడళ్లు, భవనాలను అధికారులు విద్యుత్ దీపాలతో కనులపండువగా అలంకరించారు. విద్యుత్ దీపాల అలంకరణతో ప్రకాశం బ్యారేజీ కొత్తకళను సంతరించుకుంది.
 ప్రముఖులకు ఆహ్వానం : ఈ వేడుకలకు సంబంధించి కలెక్టర్ బాబు.ఎ ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, స్వాతంత్య్ర సమరయోధులకు ఆహ్వానాలను పంపారు. గవర్నర్, సీఎంలతోపాటు పలువురు మంత్రులు ఆదివారం సాయంత్రానికే నగరానికి చేరుకుంటారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ రిపబ్లిక్ డే వేడుకలను తిలకించాలనుకునే నగరవాసులు సోమవారం ఉదయం ఏడు గంటలలోపు స్టేడియంలోకి రావాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు