రాజ్‌భవన్‌లో ఘనంగా ఎట్‌ హోం

27 Jan, 2020 05:18 IST|Sakshi
ఎట్‌హోం కార్యక్రమంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌తో సీఎం వైఎస్‌ జగన్‌..

సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు ప్రముఖుల హాజరు

ఏపీలోని రాజ్‌భవన్‌లో తొలిసారిగా కార్యక్రమం

చంద్రబాబుతో సహా హాజరుకాని ప్రతిపక్ష సభ్యులు 

సాక్షి, అమరావతి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ఆదివారం ఎట్‌ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా విజయవాడలో ఈ కార్యక్రమం జరగడం విశేషం. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఇచ్చిన తేనీటి విందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాజ్‌భవన్‌లో సీఎం వైఎస్‌ జగన్‌కు గవర్నర్‌ ప్రత్యేక ఆహ్వానం పలికారు. అనంతరం తేనీటి విందుకు హాజరైన వారి ప్రతి టేబుల్‌ వద్దకు వెళ్లి పలకరించి అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్, లోకాయుక్త జస్టిస్‌ పి.లక్ష్మణరెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, వెలంపల్లి శ్రీనివాస్, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఎస్‌ఎస్‌ రావత్, ప్రవీణ్‌ ప్రకాష్, సతీష్‌చంద్ర, నాగులాపల్లి శ్రీకాంత్, సిద్ధార్థ జైన్, అజయ్‌ జైన్, అర్జా శ్రీకాంత్, జె.వెంకట మురళీ, వినయ్‌ మోహన్, ప్రద్యుమ్న, గవర్నర్‌ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా, కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్, విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు ఎంవీ సురేంద్రబాబు, ఏఆర్‌ అనురాధ, హరీష్‌కుమార్, బత్తిన శ్రీనివాస్‌ పాల్గొన్నారు. అలాగే సమాచార శాఖ కమిషనర్‌ టి.విజయ్‌కుమార్‌రెడ్డి, తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, టీటీడీ అర్చకులు రమణ దీక్షితులు, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లాది విష్ణు, ఎమ్మెల్యేలు జోగి రమేష్, కైలే అనిల్‌కుమార్, ముదునూరి ప్రసాదరాజు, కొఠారు అబ్బయ్యచౌదరి, పుప్పాల శ్రీనివాసుబాబు, సీనియర్‌ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావుతోపాటు పలువురు రాజకీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. 
కార్యక్రమానికి హాజరైన మంత్రులు, అధికారులు   

చంద్రబాబుతో సహా ప్రతిపక్ష సభ్యులు గైర్హాజరు..
ప్రతియేటా రిపబ్లిక్‌ డే రోజున రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆనవాయితీగా ఎట్‌ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులతోపాటు రాజకీయ పార్టీల నేతలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులకు తేనీటి విందు ఇస్తుంటారు. ఈ సారి ఏపీలో తొలిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత చంద్రబాబుతోపాటు టీడీపీకి చెందిన సభ్యులు ఎవరూ హాజరు కాకపోవడం గమనార్హం. 

గవర్నర్‌తో అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌ భేటీ
గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌లు వేర్వేరుగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను తమ్మినేని సీతారాం శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. వారిద్దరి మధ్య రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. మండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ ఆదివారం ఉదయం గవర్నర్‌ను కలిశారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు వంటి కీలక బిల్లులు మండలిలో చర్చకు రాకుండా ప్రతిపక్ష టీడీపీ అడ్డుకోవడం, రూల్‌–71 కింద చర్చ చేపట్టడం, చివరకు ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు ప్రధాన బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతామంటూ ప్రకటించడం వంటి కీలక పరిణామాల నేపథ్యంలో గవర్నర్‌ను చైర్మన్‌ షరీఫ్‌ కలవడం చర్చనీయాంశమైంది. మండలిలో చోటు చేసుకున్న పరిణామాలు వారి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. సోమవారం అసెంబ్లీ సమావేశం కానుండటంతో మండలి కొనసాగింపులో ప్రభుత్వం ఎలాంటి వైఖరి తీసుకుంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొన్న తరుణంలో గవర్నర్‌తో స్పీకర్, మండలి చైర్మన్‌ భేటీ కావడం గమనార్హం. 

మరిన్ని వార్తలు