ఉరిశిక్ష తీర్పు నిజమైన నివాళి

14 Sep, 2013 04:02 IST|Sakshi

నెల్లూరు(దర్గామిట్ట), న్యూస్‌లైన్:  లైంగిక దాడి ఘటనలో నిందితులకు ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు నిర్భయకు నిజమైన నివాళి అని తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అంచెలవాణి తెలిపారు. నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష తీర్పు ఇచ్చిన సందర్భంగా హరనాథపురం సెంటర్‌లో అంచెల వాణి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా సత్వర విచారణ జరిపి నిందితులకు ఉరిశిక్ష వేయడం హర్షణీయమన్నారు. ఉరిశిక్ష తీర్పు విషయంలో హైకోర్ట్‌కు అప్పీల్ చేయకుండా ఉండేందుకు న్యాయవాదులు ఎవరూ ముందుకు రాకూడదని కోరారు.  టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు తిరుమలనాయుడు, తెలుగుమహిళ కార్యకర్తలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
 
 నిందితులకు ఉరిశిక్షపై హర్షం
 నిర్భయపై జరిగిన లైంగిక దాడి కేసులో నిందితులకు ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉరిశిక్ష తీర్పు హర్షణీయమని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిర్భయ కేసులో ప్రత్యేక కోర్టు ద్వారా తొమ్మిది నెలల్లోనే విచారణ పూర్తి చేసి తీర్పును వెలువరించడం హర్షణీయమన్నారు. ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి నగరంలో తల్లీకూతుళ్లు భార్గవి, శకుంతలను హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.   
 
 మహిళా ఎన్జీఓల కొవ్వొత్తుల ప్రదర్శన
 నెల్లూరు సిటీ: నిర్భయకు ఘన నివాళులర్పిస్తున్నట్లు ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు రవీంద్రబాబు పేర్కొన్నారు. నిర్భయపై లైంగిక దాడికి పాల్పడి అత్యంత పాశవికంగా ప్రవర్తించిన దుర్మార్గులకు మరణశిక్ష విధించిన సందర్భంగా మహిళా ఎన్జీఓలు శుక్రవారం దర్గామిట్టలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.  ఈ సందర్భంగా మహిళలు మిఠాయిలు పంచిపెట్టారు. శైలజ, కరుణకుమారి, నిర్మల, యోగవల్లీ, హేమలత, మంజుల, రమణారెడ్డి, శేఖర్‌రావు, సతీష్‌బాబు, సీహెచ్ సుధాకర్‌రావు  పాల్గొన్నారు.
 
 వేధించే వారికి గుణపాఠం
 నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఢిల్లీ లైంగిక దాడి కేసులో నిందితులకు ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాకు విజయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  మహిళలను వేధించే వారికి నిర్భయ కేసు ఒక గుణపాఠం కావాలన్నారు. మహిళల రక్షణ విషయంలో చట్టాలు మరింత కఠినతరం కావాలని తెలిపారు.
 

మరిన్ని వార్తలు