ఉద్యోగ భద్రత కల్పించాలి

22 Dec, 2015 00:46 IST|Sakshi

ఏపీ గోపాలమిత్రల సంఘం డిమాండ్
విజయవాడలో భారీ ర్యాలీ

 
విజయవాడ (గాంధీనగర్) : కనీస వేతనం రూ.13 వేలు ఇవ్వాలని గోపాలమిత్రల సంఘం (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షుడు బీ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ గోపాలమిత్రల సంఘం ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో ధర్నా నిర్వహించారు. తొలుత రైల్వేస్టేషన్ నుంచి లెనిన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ  చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు గోపాలమిత్రలను నియమించినా ఉద్యోగ భద్రత కల్పించలేదన్నారు. వీరికి ప్రభుత్వం నామమాత్రపు వేతనం చెల్లిస్తోందని తెలిపారు. టార్గెట్లతో జీతంలో కోతలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రైవేటు డెయిరీలతో గోపాలమిత్రల జీవనోపాధి దెబ్బతింటుందని తెలిపారు. పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనుభవజ్ఞులైన గోపాలమిత్రలను వెటర్నరీ అసిస్టెంట్లుగా నియమించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘ గౌరవాధ్యక్షుడు నాగేశ్వరరావు, గోపాలమిత్రల సంఘ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, కౌలు రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి జమలయ్య, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి క్రాంతి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, గోపాలమిత్రలు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు