ఏపీలో మిగిలిన ఇంటర్‌ పరీక్షలకు రీషెడ్యూల్‌

16 May, 2020 04:02 IST|Sakshi

జూన్‌ 3న మోడ్రన్‌ లాంగ్వేజ్‌–2, జాగ్రఫీ–2 పరీక్షలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిలిచిపోయిన ఇంటర్మీడియెట్‌ రెండో ఏడాది మోడ్రన్‌ లాంగ్వేజ్‌–2, జాగ్రఫీ–2 పరీక్షలు జూన్‌ 3వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి ఎం.రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. షెడ్యూలు ప్రకారం ఈ పరీక్షలు మార్చి 23న జరగాల్సి ఉండగా కరోనా, లాక్‌డౌన్‌ల కారణంగా వాయిదా వేశారు. తాజా రీషెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 3న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు గతంలో జారీ చేసిన హాల్‌ టిక్కెట్లలో పేర్కొన్న పరీక్ష కేంద్రాల్లోనే ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి పరీక్ష కేంద్రాలకు రావాలి. పరీక్ష కేంద్రాల్లో భౌతికదూరం, శానిటైజేషన్‌ తదితర ఏర్పాట్లకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, ఇంటర్మీడియెట్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియకు బోర్డు ఏర్పాట్లు చేసింది. రెడ్‌ జోన్లలో మినహా తక్కిన ప్రాంతాల్లోని మూల్యాంకన కేంద్రాల్లో జవాబు పత్రాల కోడింగ్‌ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. ఇది పూర్తయిన అనంతరం మూల్యాంకనాన్ని ప్రారంభిస్తారు. 

మరిన్ని వార్తలు