ఏసీబీ వలలో గురుకుల ప్రిన్సిపల్ సుభాషిణి

14 May, 2014 08:55 IST|Sakshi

నెల్లూరు జిల్లాలో మరోఅవినీతి చేప అధికారుల వలలో చిక్కింది. నెల్లూరు జిల్లా చిల్లకూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సుభాషిణి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన సోమనాథ్ ట్రేడర్స్ నిర్వాహకులు పులిపాటి వెంకటేశ్వర్లు, కేవీ లక్ష్మినారాయణ 2013-14కు సంబంధించి గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, కప్పులు సరఫరా చేశారు.
 
 ఇందుకుగాను వారికి రూ.1.27 లక్షలు చెల్లించాల్సి ఉంది. నగదు చెల్లించాలని సుభాషిణికి వారం కిందట ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. బిల్లులు చెల్లించాలని సోమనాథ్ ట్రేడర్స్ నిర్వాహకులు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ను కోరగా రూ.20 వేలు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. చివరకు రూ.15 వేలు ఇచ్చేలా బేరం కుదిరింది. అనంతరం వారు ఏసీబీ డీఎస్పీ నంజుండప్పను కలిసి విషయాన్ని వివరించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు ట్రేడర్స్ నిర్వాహకులు ప్రిన్సిపల్‌కు ఇంటి వద్దరూ.10 వేలు, పాఠశాల సీనియర్ అసిస్టెంట్ రమణయ్యకు పాఠశాలలో రూ.5 వేలు ఇచ్చారు. ఏసీబీ అధికారులు ఒక్కసారిగా ఇద్దరిపై దాడులు చేసి ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు