సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ‘రాజీ’ డ్రామాలు!

2 Aug, 2013 01:52 IST|Sakshi
రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజలు భగ్గుమనడంతో పాటు ఆందోళనలను తీవ్రతరం చేస్తుండటంతో ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు కొత్త ఎత్తుగడ మొదలుపెట్టారు. రాజీనామా చేస్తే పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందనే భయం ఒకవైపు, చేయకపోతే కనీసం నియోజకవర్గాల్లోకి కూడా వెళ్లలేమనే భయం మరోవైపు వెంటాడుతున్న నేపథ్యంలో రాజీనామాల పేరుతో హైడ్రామాకు వారు తెర తీశారు. కొందరు ఎమ్మెల్యేలు తాము పీసీసీ అధ్యక్షునికి రాజీనామా లేఖలు పంపుతున్నట్టు ప్రకటించారు. మరికొందరేమో ఫ్యాక్స్ ద్వారా స్పీకర్‌కు రాజీనామా లేఖలు పంపినట్టు తెలిపారు. వారిలోనూ కొందరు స్పీకర్ ఫార్మాట్‌లో కాకుండా, ‘రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశాం’ అని పేర్కొంటూ సుదీర్ఘ లేఖలను రూపొందించి స్పీకర్ కార్యాలయానికి పంపుతున్నట్టు ప్రకటించారు. ఆయా లేఖలను మీడియాకు కూడా ప్రదర్శించారు! తాను, ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేశ్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేశామని గురువారం రాత్రి పొద్దుపోయాక గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. వాటిని సీఎంకు పంపినట్టు చెప్పారు. 
 
 రాష్ట్ర విభజన ఖాయమంటూ ఢిల్లీ నుంచి ముందే సంకేతాలున్నప్పటికీ ఇంతకాలం మిన్నకుండిపోయిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, విభజనపై నిర్ణయం వెలువడ్డ మూడు రోజుల తరవాత... రాయలసీమ, కోస్తా ప్రాంత ప్రజల నుంచి వస్తున్న ఒత్తిళ్లు, ఉద్యమాల నేపథ్యంలో రాజీనామాల పర్వానికి తెరతీశారు. అయితే, పార్టీ పదవులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఈ నేతలు తెగేసి చెబుతున్నారు. ‘రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు. మా పదవులకు వదులుకునేందుకు కూడా సిద్ధం’ అని మీడియా ముందు గట్టిగా చెబుతున్న నేతలు, ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా గురువారం మధ్యాహ్నం మంత్రుల నివాస ప్రాంగణంలోని క్లబ్‌హౌస్‌లో సమావేశమైన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తొలుత రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. 17 మంది మంత్రులు, 27 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలతో కలిపి మొత్తం 56 మంది ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొని రాజీనామాలపై సుధీర్ఘంగా చర్చించారు. విభజనను వ్యతిరేకిస్తూ స్పీకర్ ఫార్మెట్‌లో మూకుమ్మడిగా శాసనసభ్యత్వాలకు రాజీనామా చేస్తామని భేటీ అనంతరం వారంతా ప్రకటించారు. కానీ సాయంంత్రానికే మాట మార్చి, ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్టుగా వ్యవహరించారు. సీమాంధ్ర ప్రాంతంలో స్పీకర్ సహా మొత్తం 97 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నప్పటికీ వారిలో పట్టుమని పది మంది కూడా స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామాకు ముందుకు రాలేదు!
 
జేసీ దివాకరరెడ్డి, గాదె వెంకటరెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆదినారాయణరెడ్డి, ఉగ్రనర్సింహారెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, మురళీకృష్ణ, ఆనం వివేకానందరెడ్డి, సుధాకర్ మాత్రమే గురువారం సాయంత్రం అసెంబ్లీకొచ్చి స్పీకర్ ఫార్మెట్లో సంతకాలు చేసిన రాజీనామాల లేఖలను శాసనసభ కార్యదర్శి రాజ సదారాంకు అందజేసి వెళ్లిపోయారు. మిగతా వారిలో కొందరు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తమ రాజీనామా లేఖలను అందజేసినట్టు చెప్పుకొచ్చారు. మరికొందరు ఫ్యాక్స్ ద్వారా స్పీకర్ కార్యాలయానికి లేఖలు పంపామన్నారు. కానీ స్పీకర్ కార్యాలయ వర్గాలు మాత్రం తమకు ఇంతవరకు ఒక్క లేఖ కూడా అందలేదని పేర్కొన్నాయి. స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా తనకు రాజీనామాల సంగతి తెలియదరని గవర్నర్ ఇఫ్తార్ విందు సందర్భంగా మీడియా ప్రశ్నలకు బదులుగా చెప్పారు.
 
ఎమ్మెల్యేలు కొత్తపల్లి సుబ్బారాయుడు, కన్నబాబు, వంగా గీత, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, పి.రాాజన్నదొర, కారుమూరి నాగేశ్వరరావు, బంగారు ఉషారాణి తదితరులు బొత్సకు రాజీనామా లేఖలు అందించారు. విభజనకు వ్యతిరేకంగా రాజీనామా చేశామనే విషయం అధిష్టానానికి తెలియాలనే బొత్సకు లేఖలిచ్చినట్టు వారు చెబుతున్నారు. సోనియాగాంధీకి, అక్కడి నుంచి స్పీకర్‌కు రాజీనామా లేఖలను పంపాలని బొత్సను కోరామన్నారు! ఇక ఎమ్మెల్సీల్లో ఏ ఒక్కరూ శాసనమండలి చైర్మన్‌కు రాజీనామాలు సమర్పించకపోవడం గమనార్హం. పాలడుగు వెంకట్రావు, గాదె శ్రీనివాసులునాయుడు తదితరులు ఫార్మెట్‌లో రాజీనామా చేసినా, లేఖలను మాత్రం బొత్సకు అందజేశారు. అధిష్టానం తీసుకున్న విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్టు మరో ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
 
 ఊగిసలాటలో మంత్రులు
 
 మరోవైపు సీమాంధ్ర మంత్రులు కూడా రాజీనామాలపై ఊగిసలాడుతున్నారు. మంత్రి పదవుల నుంచి తప్పుకుంటామని తొలుత ప్రకటించిన వారిలో కొద్దిమంది మినహా మిగతా వారంతా రాజీనామాకు సిద్ధపడలేదు. రాజీనామాల విషయంలో తొందర పడొద్దని, అధిష్టానం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స చెప్పడంతో పునరాలోచనలో పడ్డారు. గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్, కాసు వెంకటకృష్ణారెడ్డి వంటి మంత్రులు రాజీనామాలకు కట్టుబడాల్సిందేనని చెబుతుండగా, మిగతా వారుమాత్రం రాజీనామాలపై ఊగిసలాటలో ఉన్నారు. రాజీనామా చేయకపోతే నియోజకవర్గాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొందనే ఆందోళన ఒకవైపు, చేస్తే పెద్దల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే భయం మరోవైపు వారిని వెంటాడుతున్నాయి. మొత్తం 22 మంది సీమాంధ్ర మంత్రుల్లో రఘువీరారెడ్డి, సి.రామచంద్రయ్య, కన్నా లక్ష్మీనారాయణ మినహా మిగతా 19 మంది గురువారం సాయంత్రం ఏడింటి తర్వాత క్యాంపు కార్యాలయంలో కిరణ్, బొత్సలతో ప్రత్యేకంగా సమావేశమై రాజీనామాలపై అనుసరించాల్సిన వ్యూహంపై రాత్రి పొద్దుపోయేదాకా సుదీర్ఘంగా చర్చించారు.
 
తల్లి మరణించడంతో రఘువీరా భేటీకి వెళ్లలేకపోయారు. కన్నా గురువారం మధ్యాహ్నమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు. రామచంద్రయ్య కూడా హైదరాబాద్‌లోనే ఉన్నారు. అయినా వారిద్దరూ వెళ్లలేదు. విభజన తప్పదని అందరికంటే ముందే గ్రహించిన సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా తాజాగా ప్రజల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో పునరాలోచనలో పడ్డారు. భావి కార్యాచరణ, రాజీనామాలపై చర్చించేందుకు గురువారం రాత్రి 10 గంటలకు ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా పరిణామాలను ఆరా తీసేందుకు ఏఐసీసీ కార్యదర్శులు, రాష్ర్ట వ్యవహారాల పరిశీలకులు తిరునావుక్కరసు, ఆర్‌సీ కుంతియా గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నట్లు వార్తలు రావడంతో వారితో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. రాజీనామా చేసేందుకు సీమాంధ్ర మంత్రులంతా క్యాంపు కార్యాలయానికి వెళ్లారని సమాచారం రావడంతో వారిద్దరు సైతం అక్కడికి వెళ్లి, తొందరపాటు నిర్ణయాలు తగవని సూచించారు.
 
 బాలరాజు నివాసంలో రాజీనామా వ్యతిరేకుల ప్రత్యేక భేటీ
 రాజీనామాలను వ్యతిరేకిస్తున్న పితాని సత్యనారాయణ, పార్థసారథి, డొక్కా మాణిక్యవరప్రసాద్, అహ్మదుల్లా తదితర మంత్రులు కొందరు గురువారం మధ్యాహ్నం మంత్రి బాలరాజు నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విభజనపై అధిష్టానం గట్టి నిర్ణయమే తీసుకున్నందున ఇప్పుడు రాజీనామాలతో లాభముండదనే అభిప్రాయానికి వచ్చారు. చేస్తే అధిష్టానాన్ని ధిక్కరించినట్టు అవుతుందన్నారు. ఇక మంత్రుల నివాస ప్రాంగణంలోని క్లబ్‌హౌస్‌లో జరిగిన భేటీలో కూడా పార్థసారథి, బాలరాజు, పితాని, కొండ్రు మురళీమోహన్, అహ్మదుల్లా తదితరులు రాజీనామాలను వ్యతిరేకించారు. రాష్ట్రాన్ని విభజిస్తే మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు సోనియాకు లేఖ రాశామని, వాటినే రాజీనామా లేఖలుగా పరిగణిస్తే సరిపోతుందని పార్థసారథి చెప్పుకొచ్చారు. గంటా, శైలజానాథ్ తదితరులు దానితో తీవ్రంగా విబేధించారు. సీఎంను కలిసి మూకుమ్మడిగా రాజీనామా పత్రాలు సమర్పించాల్సిందేనని పట్టుబట్టారు. టీజీ తదితరులు అందుకు మద్దతు పలకారు. ఎవరొచ్చినా రాకుండా తానైతే ఇప్పుడే రాజీనామా చేస్తానని గంటా ప్రకటించడంతో సమావేశంలో కాసేపు గందరగోళం నెలకొంది. చివరకు సీఎంతో మాట్లాడాకే నిర్ణయం తీసుకుందామని నేతలు సర్దిచెప్పారు. భేటీ ముగిసిన కాసేపటికే గంటా రాజీనామా చేసినట్టు చానళ్లలో వార్తలు రావడంతో పలువురు మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రెడిటంతా తానే తీసుకోవాలనే అలా చేశారని ఇతరులు వ్యాఖ్యానించారు.
 
 ముక్కలు చేస్తోంది టీడీపీయే: శైలజానాథ్
 ‘‘రాష్ట్రం విచ్ఛిన్నమై తెలుగుజాతి రెండుగా చీలిపోవడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే కారణం. తెలుగుజాతిని, రాష్ట్ర ప్రజలను బాబు వెన్నుపోటు పొడిచారు. ఏ మాత్రం విచారం, దిగులు లేకుండా విభజనకు స్వాగతం పలకడం సిగ్గుచేటు’’
 
 మౌనంగా ఉండి మోసపోయాం: జేసీ
 ‘‘రాష్ట్ర విభజన జరగదనే ఉద్దేశంతో ఇన్నాళ్లూ ఉద్యమాలు చేయకుండా మౌనంగా ఉండటం వల్లే సీమాంధ్రులు మోసపోయారు. ప్రశాంతంగా ఉంటే ఢిల్లీ పెద్దలు వినేలా లేరు. వారు దిగొచ్చేలా ఉద్యమిస్తాం.’’
 
 రాష్ట్రపతి పాలనకు భయపడం: గాదె
 ‘‘రాష్ట్రం ముక్కలవుతుందని తెలిసి మా పదవులకు రాజీనామా చేశాం. మా రాజీనామాలతో సంక్షోభం ఏర్పడి రాష్ర్టపతి పాలన వస్తుందనుకోవడం లేదు. వచ్చినా భయపడేది లేదు.’’
మరిన్ని వార్తలు