అప్పుడే మొదలు

12 Jul, 2014 00:11 IST|Sakshi
అప్పుడే మొదలు
  • రుణమాఫీపై కొరవడిన స్పష్టత
  •  రీషెడ్యూల్‌పైనా అయోమయం
  •  బకాయిలు చెల్లించాలంటున్న బ్యాంకర్లు
  •  ప్రైవేటు అప్పుల కోసం రైతుల అగచాట్లు
  • వరుణుడు కరుణించినా.. ప్రభుత్వం మాత్రం అన్నదాతలతో పరిహాసమాడుతూనే ఉంది. కురుస్తున్న వర్షాలు కొత్త ఆశలు చిగురింపచేస్తున్నా.. చేతిలో చిల్లి గవ్వ లేక రైతు దిక్కులు చూస్తున్నాడు. రుణ మాఫీ పేరుతో వంచించిన ప్రభుత్వం తాజాగా రీ షెడ్యూల్ ప్రకటన తెరపైకి తెచ్చింది. అయితే అన్నదాతలు బ్యాంకులకు వెళితే తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదంటూ సిబ్బంది తిప్పి పంపుతున్నారు. దాంతో ఖరీఫ్ మదుపుల కోసం అంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
     
    విశాఖ రూరల్/నర్సీపట్నం రూరల్ : తెలుగుదేశం ప్రభుత్వం తప్పుడు హామీలు కారణంగా రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. రుణాలు రద్దు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి వరకు ఆ విషయాన్ని తేల్చలేదు. రుణాలు రీషెడ్యూల్‌కు ఆర్‌బీఐ సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు బ్యాంకర్లకు ఎటువంటి ఉత్తర్వులు అందలేదు. రీషెడ్యూల్ కారణంగా వడ్డీ భారమవుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

    2013-14 ఖరీఫ్, రబీ సీజన్‌లలో జిల్లాలోని 2,10,881 మంది రైతులు వ్యవసాయ పెట్టుబడులకు జాతీయ, సహకార బ్యాంకుల్లో సుమారుగా రూ. 894 కోట్లు రుణాలుగా తీసుకున్నారు. ఖరీఫ్ మార్చి చివరిలోగా, రబీ బకాయిలు జూన్ చివరిలోగా చెల్లించాల్సి ఉంది. కాలం కలిసి రాకపోవడంతో పాటు ప్రస్తుత అధికార పార్టీ రుణ మాఫీ ప్రకటించడంతో చెల్లింపులన్నీ నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో మొత్తం 2 లక్షల 304 మంది రైతులకు రూ.700 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు.

    ఇందులో కొత్త వారి కంటే రెన్యువల్స్‌కే ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. ఈ ఖరీఫ్‌లో 58,211 మంది కొత్త వారికి రూ.250 కోట్లు మాత్రమే ఇవ్వాలన్నది లక్ష్యం. రెన్యువల్స్ విషయానికి వస్తే 1,42,093 మంది రైతులకు రూ.450 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు 1668 మంది రైతులకు కేవలం 3.03 కోట్లు రుణాలు మాత్రమే అందజేశారు. మిగిలిన వారు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తూ పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ చేతిలో చిల్లిగవ్వలేక పంటలు వేయలేని దుస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం రుణాలు అందించే విషయంలో సత్వరం చర్యలు తీసుకోని పక్షంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది.
     
    బ్యాంకర్లు... మరో‘సారీ’
     
    కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి నెల రోజులు దాటినా ఇంతవరకు రుణ మాఫీపై స్పష్టత లేకుండా పోయింది. దీనికై సీఎం వేసిన ప్రత్యేక కమిటీ నేటికీ నివేదిక ఇవ్వలేదు. దీంతో  ఇటీవల రుణ మాఫీ స్థానే రీ షెడ్యూల్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ విధానాన్ని ప్రకటించి రోజులు గడుస్తున్నా  దీనికి సంబంధించిన విధి విధానాలపై బ్యాంకర్లకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. ఈ నేపథ్యంలో రుణాల కోసం బ్యాంకులకు వెళ్లిన రైతులకు వారు ఇదే విషయాన్ని చెప్పి తిరిగి పంపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అడపా, దడపా చినుకులు పడుతుండడంతో రైతులు సాగు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో వడ్డీ ఎక్కువైనా ప్రైవేటు అప్పులు చేయక తప్పదంటూ ఆవేదన చెందుతున్నారు.
     
      రుణాలు ఇస్తేనే...
     నాది గొలుగొండ మండలం పాత మల్లంపేట పంచాయతీ ద్వారకానగర్. ఏటా 6 ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు చేస్తాను. ప్రస్తుతం అడపాదడపా వర్షా లు పడుతున్నాయి. బ్యాంకర్లు అప్పులిస్తారన్నఆశతో గ్రామం లోని పెద్దల వద్ద చేబదులుగా కొంత నగదు తెచ్చి విత్తనాలు జల్లాను. ఉబాలు, నాట్లు, ఎరువులు, క్రిమిసంహారక మందులకు మరి కొంత అవసరం ఉంటుంది. రుణం విషయమై బ్యాంకర్లు నోరు మెదపకపోవడంతో ప్రైవే టు అప్పుల కోసం తిరుగుతున్నాను.
     - సుర్ల సన్యాసిపాత్రుడు, రైతు, పాత మల్లంపేట
     
     ప్రైవేటు అప్పులే దిక్కు
     నాది గొలుగొండ మండలం జోగుంపేట. నాకున్న ఐదెకరాల్లో వరి సాగుకు సిద్ధమయ్యాను. గతేడాది పంట కలిసిరాకపోవడంతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం చెల్లించలేకపోయాను. ఈ ఏడాది రుణాల రీ షెడ్యూల్‌కు ప్రభుత్వం ఆదేశించినా బ్యాంకర్లు కొత్త అప్పులిచ్చేందుకు వెనుకంజవేస్తున్నారు. ఇలా అయితే ప్రైవేటు అప్పులతో బాగా నష్టపోవడం తప్పదు.
     - కె.రామకృష్ణ, రైతు,జోగుంపేట.
     

మరిన్ని వార్తలు