కుయ్‌..కుయ్‌..ఇక రయ్‌..రయ్‌

30 Jul, 2019 11:18 IST|Sakshi

సాక్షి, మచిలీపట్నం(కృష్ణా) : ఒకప్పుడు ఆపద నేస్తంగా పేరొందిన 108 సర్వీసులకు మళ్లీ జీవం పోసేలా ప్రస్తుత ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. రోడ్డు ప్రమాదాలు జరిగినా, గర్భిణులను ప్రసవం కోసమని సకాలంలో ఆస్పత్రులకు చేర్చాలన్నా, మరే ఇతర సమయాల్లోనైనా అత్యవసర వైద్య సేవల కోసమని బాధితులను తరలించేందుకు ఒక్క ఫోన్‌ కాల్‌ చేయగానే క్షణాల్లో వాలిపోయే 108 సర్వీసులను మళ్లీ రోడ్లపై శరవేగంతో పరుగులు పెట్టించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది.  

జిల్లాలో 35 వాహనాలు..
జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రస్తుతం 35 వాహనాలు అందుబాటులో ఉండగా, వీటి ద్వారా ప్రతి రోజు మూడు వేలకు పైగా బాధితులను ఆసుపత్రులకు చేర్చుతున్నారు. ఫైలెట్, ఎమర్జన్సీ మెడికల్‌ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌లు కలుపుకొని జిల్లాలో 170 మంది వరకు సిబ్బంది ఇందులో పనిచేస్తున్నారు. 

గత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి
అత్యవసర సమయాల్లో అపర సంజీవనిలో బాధితుల చేరువకు వచ్చే 108 సర్వీసులను టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచే అత్యవసర సేవలకు కూడా నిధులు కోత పెట్టిన కారణంగా చాలా చోట్ల వాహనాలు మరమ్మత్తులకు గురై మూలన పడ్డాయి. ఇలా ప్రస్తుతం జిల్లాలో ఎనిమిది వాహనాలు సవ్యంగా ముందుకు నడవటం లేదు. బ్యాటరీల చార్జ్‌ కూడా లేని స్థితిలో వాహనాలు స్టాట్‌ కావాలంటే కొంతమంది చేరి నెట్టాల్సిన దుస్థితి ఇప్పటి వరకు ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నూతన ప్రభుత్వం వైద్యరంగంపై ప్రధాన దృష్టి సారించిన నేపథ్యంలో 108 సర్వీసులను పటిష్ట పరిచేందుకు కార్యాచరణ సిద్దం చేసింది. 

మండలానికో 108 వాహనం..
జిల్లాలో ప్రస్తుతం ఉన్న వాహనాలతో పాటు, ప్రతి మండలానికి ఒక కొత్త 108 వాహనం అందుబాటులోకి వచ్చేలా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మరమ్మత్తులకు గురైన వాహనాల స్థానంలో కూడా కొత్తవి ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జిల్లాలో 50 వాహనాలతో పాటు, మరమ్మత్తులకు గురైన ఎనిమిది వాహనాల స్థానంలో కూడా కొత్తవి రానున్నాయి. ప్రతి మండల కేంద్రంలో వాహనం అందుబాటులో ఉంచటంతో పాటు, జిల్లా ప్రధాన ఆస్పత్రులు, ఏరియా వైద్యశాలల వద్ద అత్యవసర సేవలు అందించేలా వీటిని ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఒక్క ఫోన్‌ కాల్‌తో మారుమూల గ్రామానికి సైతం క్షణాల్లో 108 వాహనాం చేరేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనుంది. 

సిబ్బందికి ఇబ్బందులు లేకుండా..
రేయింబవళ్లు కంటిపై కునుకు లేకుండా సేవలు అందిస్తున్న 108 సిబ్బంది సమస్యలను సైతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిష్కరించేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. వేతనాల కోసమని సిబ్బంది ఇటీవల సమ్మెకు దిగగా, సమస్యల పరిష్కారానికి నేరుగా ముఖ్యమంత్రి తగిన హామీ ఇవ్వటంతో సిబ్బంది దానిని విరమించి రెట్టించిన ఉత్సాహంతో సేవలు అందిస్తున్నారు.

సిబ్బంది సమస్యలపై దృష్టి సారించాలి..
అత్యవసర సేవలు అందిస్తున్న 108 సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. వాహనాల నిర్వహణ కూడా ఇబ్బంది కరంగా ఉంది. మరమ్మతులకు గురైతే వెంటనే సమస్యకు పరిష్కారం చూపేలా ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించటం హర్షణీయం.
– రవికుమార్, ఫైలెట్‌

ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగానే..
అత్యవసర వైద్య సేవల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేసేలా సిబ్బందిని అప్రమత్తం చేశాం. ప్రతి మండలానికి ఒక కొత్త వాహనం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నాం.
– సంతోష్, జిల్లా మేనేజర్‌

మరిన్ని వార్తలు