తేలనున్న ‘ఇంటి’గుట్టు

3 Jan, 2015 04:45 IST|Sakshi
  •  
  •  జేఎన్‌ఎన్‌ఆర్‌యూఎం ఇళ్ల కేటాయింపుపై కమిటీ
  •  రెవెన్యూ..యూసీడీ సంయుక్త సర్వే
  •  సంక్రాంతిలోగా అందజేయనున్న నివేదిక
  •  బినామీలలో మొదలైన కలవరం
  • విశాఖపట్నం సిటీ : అవకతవకలమయమైన జేఎన్‌ఎన్‌ఆర్‌యూఎం ఇళ్ల కేటాయింపుపై అధికారులు దృష్టి సారించారు. మహా విశాఖలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద నిర్మితమైన గృహాల వ్యవహారం నిగ్గుతేల్చాలని తాజాగా సంకల్పించారు. అనర్హులే ఎక్కువగా ఉన్నారనే ఫిర్యాదులు అందడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

    ఇప్పటికే కోర్టుల నుంచి మొట్టికాయలు వేయించుకున్న మహా నగర పాలక సంస్థ నివేదికల్లో వాస్తవాలను బయటపెట్టేందుకు రెవెన్యూ యంత్రాంగం సైతం కదిలింది. దీనిలో భాగంగా అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అధికారులు, రెవెన్యూ బృందాలు సంయుక్తంగా సర్వే చేసి అర్హుల నిగ్గు తేల్చేందుకు నడుం బిగించాయి.

    అసంపూర్తిగా ఎన్ని ఇళ్లు వున్నాయి... కేటాయింపు జరిగిన గృహాల్లో ఎవరెవరు ఉంటున్నారు...ఉంటున్న వారు అర్హులా..కాదా...రిజర్వుడు కేటగిరీల కింద ఎంత మంది ఉంటున్నారు... ఆక్రమించిన వారికి ఎవరెవరు సిఫార్సు చేశారు... బినామీల పేర్లతో ఎవరెవరు ఎన్ని ఇళ్లు ఆక్రమించారు తదితర అంశాలపై రెవెన్యూ వారు నిగ్గు తేల్చనున్నారు. ఇందుకు 33 బృందాలను ఏర్పాటు చేశారు. బృందంలో ముగ్గురు నలుగురు చొప్పున అధికారులుంటారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ బృందాలు సర్వే చేపట్టనున్నాయి. సంక్రాంతి లోగా వీరిచ్చే నివేదిక ఆధారంగానే అర్హులను గుర్తించి, వారికి అన్ని సదుపాయాలు కల్పించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేయనుంది.
     
    14,203 ఇళ్లు నిర్మాణం

    విశాఖ అర్బన్‌లో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం హౌసింగ్ ప్రాజెక్టును 2006లో ప్రారంభించినా 2008 వరకూ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మాత్రమే పర్యవేక్షించేది. ఆ తర్వాత నుంచీ జీవీఎంసీకి ప్రభుత్వం అప్పగించింది. అప్పటి నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టి 15,320 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే స్థల వివాదాలు, కోర్టు వ్యాజ్యాలు వల్ల 14,203 ఇళ్లను మాత్రమే 38 లే అవుట్లలో నిర్మించారు. ఇందులో 12,947 ఇళ్లకు కేటాయింపు చేశారు.

    ఇంకా 1,256 ఇళ్లు మాత్రమే అధికారికంగా ఖాళీ వున్నట్టు లెక్కలేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితికొచ్చేసరికి 5 వేలకు పైగా ఇళ్లు ఖాళీగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ బినామీలే. రాజకీయ నేతల అనుయాయులు తాళాలు వేసి తమ వారి కోసం సిద్ధంగా ఉంచుకున్నారు. గతంలోనే అప్పటి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులే ఎక్కువ ఇళ్లను స్వాహా చేసినట్టు అధికారులు లెక్కలేస్తున్నారు.

    అప్పటి ఎమ్మెల్యే, మంత్రుల అనుచరులు కాజేయడంతో ఇప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలకు జీవీఎంసీ అధికారులపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. గతంలో స్వాహా చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారంటే తమ పరిస్థితి ఏంటని మల్లగుల్లాలు పడుతున్నారు. మొత్తానికి ఆ ఇళ్లల్లో ఎవరెవరు ఉంటున్నారనేదానిపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు.
     
    అన్నీ సమస్యలే..!
    జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి రూ. 300 కోట్లు రావాల్సి వుంది. ఆ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో వుండిపోయాయి. అక్కడి నుంచి ఆ మొత్తం తెచ్చుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఇదంతా ఇప్పట్లో అయ్యే పని కాదని తేలడంతో ఇంజనీరింగ్ అధికారులు పనులకు ఫుల్‌స్టాప్ పెట్టారు.
     
    ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, నీటి సదుపాయాల్లేవు. అందుకే ఇళ్ల కేటాయింపులు జరిగినా మెజార్టీ ఇళ్లు తాళాలు వేసే ఉన్నాయి.
     
    అర్హుల గుర్తింపు ఇలా..!
    జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లు కేటాయించేందుకు అర్హులను ఇలా గుర్తించాలంటూ ప్రభుత్వం మార్గ దర్శకాలు జారీ చేసింది. మొత్తం ఇళ్లల్లో ఎస్సీలకు 16శాతం, ఎస్టీలకు 6 శాతం, మైనార్టీలకు 5 శాతం ఇళ్లను కేటాయించాలని సూచించింది. మిగిలిన ఇళ్లల్లో రహదారుల విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి, గెడ్డలు, కెనాల్స్‌పై ఉంటున్న వారికి, కొండ ప్రాంతాల్లో వారికి, రైల్వే,డిఫెన్స్, పోర్టు స్థలాల్లో అనధికారికంగా ఉంటున్న వారికి ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఇళ్లు కాలిపోయిన వారికి, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లోని బాధితులు, వికలాంగులు, హెచ్‌ఐవీ బాధితులకు, అనాథలకు నిబంధనల మేరకు ఇళ్లు కేటాయింపులు చేయాలని సూచించారు.
     
    జరుగుతుందిలా..!

    రాజకీయ నేతలు సిఫార్సు చేసిన వారికి, మంత్రులు, ఎమ్మెల్యేల అనుయాయులకు కేటాయింపులు చేస్తున్నారు.
         
    జీవీఎంసీలోని మాజీ  కార్పొరేటర్లకు, రాజకీయ పార్టీల్లోని ముఖ్య నేతల అనుయాయులకు, వాళ్ల ఇళ్లల్లో పనిచేసే వారికి మాత్రమే ఇస్తున్నారు.
         
    అధికారిక పార్టీల వార్డు అధ్యక్షులు రూపొం దించే నివేదికలకే పచ్చజెండా చూపుతున్నారు.
         
    జన్మభూమి కమిటీలు జోక్యం పెరిగిపోవడంతో వార్డు నేతల చుట్టూ ఇళ్ల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు.
     
    ఓడీఏ బెటర్..!

    విశాఖలో ఓడీఏ పేరుతో  పలు మురికివాడలను నిర్మించి అభివృద్ధి చేసిన ఘనత  ఓవర్సీస్ డెవలప్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్‌దే. ఎలాంటి అభివృద్ధి లేని సమయంలో ఆరిలోవలో 10 సెక్టార్లను అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఆరిలోవలో ఎలాం టి సదుపాయాలున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు నిర్మిస్తున్న జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్లల్లో అలాంటి సదుపాయాలున్నాయో లేదో అధికారులకే తెలియాలి.
     
     సదుపాయాలు లేని ఇళ్లు ఇవే..!
     
    చాలా ఇళ్లల్లో కనీస సదుపాయాలు కల్పించేందుకు నగర పాలక సంస్థ మీనమేషాలు లెక్కిస్తోంది. ఇళ్లు కట్టేశామంటూ గొప్పలు చెప్పే ఇంజినీరింగ్ శాఖ అక్కడ కనీస సదుపాయాలున్నాయో లేదో చూడడం లేదు. వేలాది గృహ సముదాయాలను రూ. కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నా కనీస అవసరాలు తీర్చే నీటి, విద్యుత్ సదుపాయాలు కల్పించడంలో విఫలమైంది.
         
    ఈ ఇళ్ల వద్ద కమ్యూనిటీ కేంద్రాలు, దుకాణ సముదాయాలు, పాఠశాల, అంగన్వాడీ భవనం, డిస్పెన్సరీ, పై అంతస్తులోని వారికి నీరు వెళ్లేందుకు అవసరమైన మోటార్లు, ట్యాంకులు ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. స్థానికంగానే ఉపాధికి అవసరమైన పరిశ్రమలు ఏర్పాటు చేస్తే తప్పా అక్కడ ప్రజలు నివాసముండలేరని అధికారులే చెబుతున్నారు.
     
     ఖాళీగా ఉన్న ఇళ్లు
     పరదేశిపాలెం-1లో     927
     బక్కన్నపాలెం-2లో     512
     కొమ్మాది-2లో 890
     సింహాచలం దరి  అప్పన్న పాలెంలో 480
     పెందుర్తి దరి     1472
     
     తాగునీటికి ఇబ్బందులు

     మాది నిరుపేద కుటుం బం. ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తాదంటే దరఖాస్తు చేసుకున్నాం. ఇక్కడ ఓ ఇంటిని కేటాయించారు.  కనీసం తాగేందుకు నీరు కూడా అందించడంలేదు. పిల్లాపాపలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం.
     - టి.లక్ష్మి

     వెళ్లాలంటే నరకమే
     ఇళ్లు కేటాయించిన అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. కనీసం రోడ్లు కూడా సక్రమంగా నిర్మించలేదు. ఇక్కడికి రావాలంటే నరకం చూడాల్సిందే.
     - ఎం. నాగేశ్వరరావు

    విద్యుత్ సదుపాయం లేదు
    మా నివాసాలకు విద్యుత్ సదుపాయం లేదు. రాత్రి సమయాల్లో చాలా భయంగా ఉంటుంది. కాలువలు, నీటి సదుపాయం లేదు. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం.
     - టి. సత్యవతి

మరిన్ని వార్తలు