చేసిన పనే మళ్లీ మళ్లీనా!

21 Dec, 2018 12:19 IST|Sakshi
కొత్తపేటలో విద్యాశాఖ అంశాలపై సర్వే చేస్తున్న అధ్యాపకుడు, విద్యార్థులు

గ్రామాభివృద్ధిపై అధికారుల నివేదికపై రీసర్వే

రెండు రోజుల్లో సర్వే సాధ్యమా?

రవాణా, భోజన చార్జీల పరిస్థితి ఏమిటి?

అధ్యాపకులు, విద్యార్థులే భరించాలా?

ఇది పబ్లిసిటీ కోసమా?

అధ్యాపకులు, అధికారుల పెదవి విరుపు

తూర్పుగోదావరి, కొత్తపేట: గ్రామాల్లో వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పన, పురోగతిపై రెండు రోజుల్లో సర్వే జరిపి నివేదించాలని ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులను ప్రభుత్వం గ్రామాల్లోకి పంపింది. గ్రామదర్శినిలో గ్రామీణాభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఆ మేరకు 51 అంశాలకు సంబంధించి 2018 మార్చి 31 నాటికి ప్రగతి, పూర్తి చేయడానికి మిగిలిన లక్ష్యం, 2018–19 లక్ష్యం, 2019–24 లక్ష్యం అంటూ నాలుగు కాలమ్స్, రెండు పేజీల్లో పేర్కొన్నారు. విద్యాశాఖకు సంబంధించి మరుగుదొడ్లు కలిగిన పాఠశాలల సంఖ్య తదితర 5 అంశాలు, పంచాయతీరాజ్‌కు సంబంధించి బీటీ రోడ్ల సదుపాయం కలిగి ఉన్న ఆవాసాలు, తాగు నీరు, అంగన్‌వాడీ, పీహెచ్‌సీ, మీ–సేవ, శిశు, మాతృ మరణాల సంఖ్య, ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్ల సంఖ్య తదితర 51 అంశాలను పేర్కొన్నారు. వీటిపై ఇప్పటికే గ్రామ దర్శిని ద్వారా కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు సర్వే చేసి నివేదికను మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల ద్వారా జిల్లా అధికారులకు నివేదించారు. ఆ నివేదిక సక్రమమా? కాదా? అనే దానిపై రీ సర్వే చేసి నివేదించాలని కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులను రంగంలోకి దింపారు.

రెండు రోజుల్లోనే..
ముగ్గురు లేదా నలుగురు విద్యార్థులకు ఒక అధ్యాపకుడి చొప్పున బృందాలుగా విభజించి, మండలానికి రెండు బృందాలకు ఈ సర్వే బాధ్యతలు అప్పగించారు. అలా జిల్లా వ్యాప్తంగా 74 ప్రభుత్వ, ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలకు చెందిన  218 మంది అధ్యాపకులను (మోనిటర్స్‌గా), 854 మంది విద్యార్థులను రంగంలోకి దింపింది. ఈ విధంగా ఒక్కో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు మూడు, నాలుగు మండలాలకు వెళ్లారు. పలు మండలాల్లో బృందాలు మండల పరిషత్‌ కార్యాలయాలకు లేదా గ్రామ పంచాయతీలకు వెళ్లి ఇప్పటికే నివేదించిన నకళ్లను తీసుకుని పరిశీలించి వాటిలో చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసి నివేదించే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. ఇదేమిటండీ! అంటే ఏమి చేస్తామండీ! అనేక ప్రభుత్వ శాఖలకు సంబంధించి 51 అంశాలపై సర్వే రెండు రోజుల్లో రెండు బృందాలు పూర్తి చేయడం సాధ్యమా? అని ఓ అధ్యాపకుడు ప్రశ్నించారు. చదువులు గాలికొదిలేసి గ్రామాల్లో అదీ ఇతర మండలాలకు వెళ్లి సర్వే చేయమన్నారు.. రవాణా చార్జీలు, భోజనం ఖర్చులు ఏమీ లేవు. ఎలా? అని ఓ విద్యార్థి ప్రశ్నించాడు.

పబ్లిసిటీ కోసమా?
ఈ ప్రభుత్వం ప్రజలను ఉద్ధరిస్తోందని, దానిలో భాగంగా అధికారులు  బాగా పనిచేస్తున్నారా? లేదా? వారిచ్చే నివేదికలు సంతృప్తికరమేనా? కాదా అని అనుమానిస్తూ వారి నివేదికలపై రీ సర్వేకు అధ్యాపకులు, విద్యార్థులను నియమించినట్టు ప్రజల నుంచి మెప్పు పొందడానికి, ప్రచారం కోసమేనని పలువురు అధికకారులు, అధ్యాపకులు పెదవివిరిచారు.

మరిన్ని వార్తలు