రాష్ట్ర ఈసీగా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి

11 Apr, 2020 03:29 IST|Sakshi

పదవీ కాలం 5 నుంచి 3 ఏళ్లకు కుదింపు.. పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్‌

గవర్నర్‌ ఆమోదం తర్వాత ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

‘స్థానిక’ ఎన్నికల సంస్కరణల కొనసాగింపులో భాగంగా నిర్ణయం

ఎస్‌ఈసీగా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి అయితే మరింత నిష్పాక్షికతకు అవకాశం

వరుస సంస్కరణలతో దేశంలో నూతన ఒరవడి

తాజా ఆర్డినెన్స్‌తో ముగిసిన ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీకాలం

సాక్షి, అమరావతి: మద్యం, ధనం ప్రభావమన్నది లేకుండా నిష్పక్షపాతంగా  స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఇటీవల అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా నియమించేలా చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ చట్టం–1994 సెక్షన్‌–200కు చేసిన సవరణల ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ విశ్వభూషణ్‌ ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.

పారదర్శకత కోసమే..
► ఇప్పటి వరకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్లుగా నియమితులవుతూ వచ్చారు. ఇక మీదట హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి.. ఎస్‌ఈసీ కానున్నారు. 
► రిటైర్డ్‌ ఐఏఎస్‌లు ప్రభుత్వ పెద్దల వద్ద పని చేసి ఉండటం వల్ల చాలా సందర్భాల్లో వారి ‘నిష్పాక్షికత’ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఎన్నికల సంస్కరణల్లో కొనసాగింపుగా ఎస్‌ఈసీగా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
► ఈ నిర్ణయం దేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో నూతన ఒరవడి సృష్టించనుంది. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం దేశంలో ఇదే ప్రథమం కానుంది. ఇందువల్ల అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని ప్రజాస్వామ్యవాదులు, న్యాయనిపుణులు, విశ్లేషకులు, మేధావివర్గాలు అభిప్రాయ పడుతున్నారు.

ఆదిలోనే ఎన్నికల సంస్కరణకు శ్రీకారం 
► పంచాయతీ రాజ్, మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అభ్యర్థులు మద్యం, డబ్బులు పంపిణీ వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే అటువంటి వారు గెలిచినప్పటికీ ఆయా పదవుల్లో కొనసాగటానికి అనర్హులుగా పరిగణించేలా రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో సంస్కరణలకు శ్రీకారం చుట్టడం తెలిసిందే. 
► గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీ పాలక వర్గాలకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ చట్ట సవరణ చేసింది.
► ప్రస్తుతం అనుసరిస్తున్న సుదీర్ఘమైన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రలోభాలకు తావివ్వని విధంగా  కేవలం 13 రోజుల వ్యవధికి తగ్గించింది. 
► ఎన్నికల్లో గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్‌ సంబంధిత గ్రామంలోనే నివసించాలని, గ్రామ పంచాయతీ కార్యాలయానికి క్రమం తప్పకుండా హాజరు కావాలని నిబంధన విధించింది. 
► ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఓటర్లను ప్రలోభ పెట్టడం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చేయటం వంటి నేరాలకు పాల్పడినట్లయితే 3 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10,000 వరకు జరిమానా విధించడానికి అవకాశం కల్పిస్తూ చట్టంలో మార్పులు చేసింది.  

గరిష్టంగా రెండు పర్యాయాలు
► రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని 5 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు కుదించినట్లు ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. మరో 3 సంవత్సరాల పదవీ కాలాన్ని గవర్నర్‌ తన అభీష్టం మేరకు పొడిగించడానికి అవకాశం కల్పించారు.
► ఒక వ్యక్తిని గరిష్టంగా ఎస్‌ఈసీగా రెండు పర్యాయాలు (3+3 ఏళ్లు) మాత్రమే కొనసాగించాలని పరిమితి విధించారు.
► ప్రస్తుతం ఎస్‌ఈసీగా పని చేస్తున్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ 2016 ఏప్రిల్‌ 1వ తేదీన ఆ బాధ్యతల్లో చేరారు. నాలుగేళ్లకు పైగానే ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. తాజా ఆర్డినెన్స్‌ ప్రకారం.. ఎస్‌ఈసీ పదవీకాలం మూడేళ్లు. ఫలితంగా నిమ్మగడ్డ పదవీకాలం పూర్తయింది. దీంతో ఆయన స్థానంలో.. ఆర్డినెన్స్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొత్త ఎస్‌ఈసీని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని వార్తలు