హైకోర్టును రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి

13 Jun, 2018 08:24 IST|Sakshi
లక్ష్మణ్‌ రెడ్డి (దాచిన చిత్రం)

రాష్ట్రపతి, ప్రధానికి రిటైర్డ్‌ జడ్జీలు, ఐఏఎస్‌ అధికారుల విజ్ఞప్తి  

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు దిశగా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలను హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు కోరారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 31 ప్రకారం రాయలసీమలో హైకోర్టును నోటిఫై చేయాలని వారు రాష్ట్రపతిని అభ్యర్థించారు. ఈ మేరకు రిటైర్డ్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి, జస్టిస్‌ బి.శేషశయనారెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు ఐవైఆర్‌ కృష్ణారావు, అజయ్‌ కల్లాం, జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ప్రధాన మంత్రి, రాష్ట్రపతిలకు ఓ లేఖ రాశారు. హైకోర్టు రాజధానిలోనే ఉండాలన్న నిబంధన ఏదీ లేదని, దేశంలో 12 రాష్ట్రాల్లో హైకోర్టులు ఆ రాష్ట్ర రాజధానులకు వెలుపల ఉన్నాయని వారు తమ లేఖలో వివరించారు.

అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని, వాస్తవానికి హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిని చట్ట ప్రకారం రాష్ట్రపతి నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, హైకోర్టులను సంప్రదించి వారి అభిప్రాయాలను తెలుసుకున్న తరువాత హైకోర్టు ఏర్పాటు విషయంలో రాష్ట్రపతి నిర్ణయం ఉంటుందన్నారు. చట్ట ప్రకారం హైకోర్టు ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ప్రత్యేకాధికారం లేదని వారు వివరించారు. ఈ నేపథ్యంలో అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించి, పరిస్థితిని సుప్రీంకోర్టుకు వివరించి, రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటయ్యేలా చూడాలని వారు ప్రధాని, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. 1953లో ఆంధ్రా రాష్ట్రం ఏర్పాటైనప్పుడు కర్నూలు రాజధాని అయిందని, గుంటూరులో హైకోర్టును ఏర్పాటైందని తెలిపారు. అయినా  చంద్రబాబు ఈ వాస్తవాలను పట్టించుకోకుండా అమరావతిలోనే హైకోర్టు ఏర్పాటయ్యేలా సీఎం చంద్రబాబు వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నారని వారు రాష్ట్రపతి, ప్రధానికి వివరించారు.

మరిన్ని వార్తలు