విశ్రాంత ఉపాధ్యాయిని హత్య

12 Aug, 2018 10:30 IST|Sakshi

కావలి అర్బన్‌: విశ్రాంత ఉపాధ్యాయురాలు హత్యకు గురైన ఘటన శనివారం మధ్యాహ్నం స్థానిక కచ్చేరిమిట్ట పోస్టాఫీస్‌ సమీపంలో వెలుగులోకి వచ్చింది. రెండో పట్టణ పోలీసుల సమాచారం మేరకు.. స్థానిక కచ్చేరిమిట్టలో గోసిపాతల సుధాకర్, దావులూరి జయలక్ష్మి (68) దంపతులు నివాసం ఉండేవారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. చాలా ఏళ్ల క్రితం భర్త సుధాకర్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. ముగ్గురు కుమార్తెలకు వివాహం కాగా, కుమారుడు శాంతివర్ధన్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. జయలక్ష్మి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ 10 ఏళ్ల క్రితమే రిటైర్‌ అయ్యారు.

 ప్రస్తుతం కచ్చేరిమిట్ట పోస్టాఫీస్‌ సమీపంలోని తన ఇంట్లో ఒంటరిగానే ఉంటుంది. శుక్రవారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో ఇంట్లోకి పురుగులు వస్తున్నాయని లైట్లు కూడా ఆపేసినట్లు స్థానికుల ద్వారా తెలిసిందన్నారు. అయితే ఆమె ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు. శనివారం మధ్యాహ్నం ఆమె హత్యకు గురైనట్లు గుర్తించిన స్థానికులు రెండో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ జీఎల్‌ శ్రీనివాసరావు, ఎస్సై వెంకటేశ్వర రాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

 గుర్తుతెలియని దుండగులు ఆమెను హత్య చేసి ఆధారాలు గుర్తించకుండా కారం చల్లినట్లు గుర్తించారు. నెల్లూరు నుంచి వచ్చిన క్లూస్‌ టీమ్‌ సభ్యులు వేలిముద్రలు సేకరించారు. డాగ్‌ స్క్వాడ్‌ ఇంట్లోని మృతదేహం వద్ద నుంచి కచ్చేరిమిట్టలోని వెంకటేశ్వరస్వామి వీధిలో దక్షిణం వైపుగా కొంతదూరం వెళ్లి తిరిగి ఇంటికి వచ్చింది. మృతదేహాన్ని పోస్టుమార్టం  నిమిత్తం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు