వసూల్‌ సొమ్ము వెనక్కి

5 Mar, 2019 18:16 IST|Sakshi
 గుడుపల్లె రాళ్లగంగమాంబ దేవస్థానం వద్ద ఉన్న స్థలం 

ఇళ్లు ఇస్తామని గతంలో వసూళ్లు

టీడీపీ నేతల చేతివాటం

నాలుగేళ్లుగా లబ్ధిదారుల నిరీక్షణ

ఎన్నికలొస్తున్నాయని చెల్లింపులకు సిద్ధం

ప్రభుత్వ భూమిలో ప్లాట్ల కోసం వసూలు చేసిన డబ్బు లబ్ధిదారులకు తిరిగి అందించేందుకు గుడుపల్లె నేతలు సిద్ధమవుతున్నారు. నాలుగేళ్ల క్రితం వసూలు చేసిన డబ్బు అధికార పార్టీకి చెందిన గుడుపల్లె ప్రధాన నేతలు పంచుకున్నారు. లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించడంలో విఫలమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, జనం ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేమని భావించి, తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. 

సాక్షి, కుప్పం : చిత్తూరు జిల్లా గుడుపల్లె సమీపంలోని రాళ్లగంగమాంబ దేవస్థానం వదళ్లున్న 52 సెంట్ల పశువులమేత బీడును చదును చేసి ప్లాట్లుగా మార్చిన విషయం తెలిసిందే. 36 మంది వద్ద ప్లాట్లు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు అధికార పార్టీ నేతలు వసూలు చేశారు. ఎన్‌టీఆర్‌ గృహకల్పనలో పశువుల మేతబీడును కాలనీ గృహాలు నిర్మించాలని గతంలో ప్రణాళిక సిద్ధం చేసి,  వసూలు కార్యక్రమం సాగించారు.  ఈ విధంగా రూ.పది లక్షలకుపైగా వసూలు చేసిన గుడుపల్లె మండల ప్రధాన నేతలు కొందరు పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. నాలుగేళ్లు పూర్తయినా, లబ్ధిదారులకు ప్లాట్లు, ఎన్‌టీఆర్‌ గృహకల్పన కింద ఇళ్లు ఇవ్వలేదు.

 
డబ్బు వాపస్‌..
రెండు నెలల క్రితం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ప్లాట్ల విక్రయాలు  కథనంపై అధికార పార్టీ అధినేతలు స్పందించినట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల వద్దకు వెళితే ఆ డబ్బుపై ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానాలు చెప్పాలో అని తర్జనభర్జన పడుతున్నారు. ప్రభుత్వ భూమిలో ప్లాట్ల కేటాయింపులో ఇబ్బంది పడుతున్నామని చెబుతూ, తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి అధికార పార్టీ నేతలు సిద్ధపడినట్లు సమాచారం ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బు తీసుకున్నామనే విషయాలు తెలుసుకుని, వారికి తిరిగి చెల్లించాలని మండలానికి చెందిన ప్రధాన నేత మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం.

ఆ... ఆదేశాలతోనే...
ఎన్నికల దృష్ట్యా తీసుకున్న నగదు తిరిగి చెల్లించాలని  తెలుగుదేశం పార్టీ అధిష్టానం వసూళ్లకు పాల్పడ్డ కొందరు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నోటిఫికేషన్‌ వెలువడకముందే లబ్ధిదారులకు డబ్బు తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.   

మరిన్ని వార్తలు