ఏటికొప్పాక బొమ్మకు చేయూత

19 Jan, 2016 23:47 IST|Sakshi

ఆర్‌బీఐ జనరల్ మేనేజర్ జి.జె.రాజు
{పపంచ మార్కెట్‌లో గిరాకీ ఉందని వెల్లడి
హస్తకళాకారులతో ముఖాముఖి

 
యలమంచిలి: ఏటికొప్పాక లక్కబొమ్మలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు రిజర్వు బ్యాంకు చేయూతనిస్తుందని ఆర్‌బీఐ జనరల్ మేనేజర్ జి.జె.రాజు చెప్పారు. సహజ సిద్ధమైన రంగులతో తయారవుతున్న  ఇక్కడి బొమ్మలకు ప్రపంచ మార్కెట్‌లో గిరాకీ ఉందన్నారు. మేక్‌ఇన్‌ఇండియాలో భాగంగా ఆర్‌బీఐ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. రిజర్వు బ్యాంకు పరిధిలో ఉన్న 56 ఆర్టిజాన్ జోన్లలో ఏటికొప్పాక లక్కబొమ్మల పరిశ్రమ కూడా ఒకటన్నారు. మారుతున్న జీవనశైలి, ప్రపంచీకరణకు అనుగుణంగా హస్తకళాకారులు నైపుణ్యం పెంపొందించుకుని సృ జనాత్మకతతో కొత్త డిజైన్లు రూపొందించాలని సూచించారు. హైదరాబాద్ నుంచి యలమంచిలి మండలం ఏటికొప్పాకకు వచ్చిన జనరల్ మేనేజర్ మంగళవారం అక్కడి కల్యాణ మండపంలో లక్కబొమ్మలు తయారుచేసే కళాకారులతో ముఖాముఖి సమావేశమయ్యారు.

హస్తకళాకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆకట్టుకునే బొమ్మలు తయారు చేస్తున్నప్పటికీ సరైన మార్కెటింగ్ సదుపాయంలేక గిట్టుబాటు కావడంలేదని కళాకారులు ఆయనకు విన్నవించారు. ప్రపంచవ్యాప్తంగా రసాయనాలతో కూడిన రంగులను చాలా దేశాలు దిగుమతిని నిషేదిస్తున్నాయని, సహజసిద్ధమైన రంగులతోనే బొమ్మలు తయారు చేస్తే ఏటికొప్పాక బొమ్మలకు భవిష్యత్తులో మరింత గిరాకీ ఉంటుందని జీఎం చెప్పారు.  ఇక్కడి హస్తకళల అభివృద్ధికి రిజర్వుబ్యాంకు ఏదైనా చెయ్యాలని తపన పడుతోందని, అందుకు ఇక్కడి పరిస్థితులు స్వయంగా  గమనించడానికి వచ్చినట్లు ఆయన  తెలిపారు.  ఇక్కడి పరిస్థితులు రిజర్వుబ్యాంకు అత్యున్నత కమిటీకి తెలియజేస్తానని ఆయన హామీ ఇచ్చారు.   కార్యక్రమంలో మార్కెటింగ్ వ్యాపారి దేవీ ప్రసాద్, హస్తకళాకారులు మాట్లాడుతూ  బొమ్మలకు ముడిసరుకైన అంకుడు కర్ర సేకరించడం కష్టమవుతోందని, దీనికి అటవీశాఖ  వెసులు బాటు కల్పించాలని కోరారు. నామ మాత్రపు వడ్డీకి రుణసదుపాయం కల్పించాలని   నివేదించారు.   

ఇక్కడి హస్తకళాకారులు రుణాలు తీర్చడంలో వెనుకబడి ఉన్నారని, వారికి మరో ఛాన్సు ఇస్తూ తిరిగి రుణాలు పొందే అవకాశం ఇస్తున్నట్టు జీఎం ప్రకటించారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు సాధించిన వారు, రాష్ట్రపతికి బహమతులు అందించిన కళాకారులు ఇక్కడ ఉండడం ఆనందదాయకమని  కొనియాడారు. కార్యక్రమానికి సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి అధ్యక్షత వహించగా రిజర్వు బ్యాంకు మేనేనర్లు ఎన్.సత్యప్రసాద్, ఎం.మురళీ, డి.శరత్‌బాబు, సాగునీటి సంఘం అధ్యక్షుడు చింతలపాటి దేవీ ప్రసాద్, ఏటికొప్పాక, యలమంచిలి ఎస్‌బీఐ మేనేజర్లు ఆర్.వెంకటేశ్వరరావు, పి.ఎస్.శ్రీనివాసమూర్తి, ఏపీ గ్రామీణవికాస బ్యాంకు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు యలమంచిలి బ్రాంచిల అధికార్లు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు