ఖజానాకు పూడ్చలేని ‘లోటు’! 

28 Feb, 2018 04:02 IST|Sakshi

ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు చెల్లించి ఉంటే  

కేంద్రం నుంచి రూ. 5,325 కోట్లు రాక

రెవెన్యూ లోటుగా పరిగణించేది అంటున్న అధికారులు 

పెండింగ్‌లో పెట్టడంతో లోటు కింద ఇచ్చేందుకు నిరాకరణ 

బకాయిల కింద చూపిస్తూ లోటు అంటే ఎలా అంటున్న కేంద్రం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదంతో భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఉద్యోగులకు బకాయి పడ్డ పీఆర్సీ డబ్బులు వారికి చెల్లించేసి ఉంటే కేంద్రం నుంచి రెవెన్యూ లోటు ద్వారా పొందే వీలున్నా ఆ అవకాశాన్ని వదులుకుంది. ఫలితంగా రాష్ట్ర ఖజానాపై మరో రూ. 5 వేల కోట్లకుపైగా భారం పడింది.  

ఉద్యోగులకు బకాయిలు చెల్లించి ఉంటే... 
రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు కావస్తున్నా రెవెన్యూ లోటు భర్తీ విషయంలో చిక్కులు వీడటం లేదు. పాత పథకాల ద్వారా ఏర్పడిన రెవెన్యూ లోటును మాత్రమే భర్తీ చేస్తామని, కొత్త పథకాల వల్ల తలెత్తిన లోటును భర్తీ చేయలేమని కేంద్ర ఆర్థికశాఖతో పాటు నీతి ఆయోగ్‌ కూడా స్పష్టం చేయటం తెలిసిందే. ఉద్యోగుల పీఆర్సీ పాత పథకం కిందకే వస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.5,325 కోట్ల పీఆర్సీ బకాయిలను అందచేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటుగా పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు భర్తీ చేసేదని అధికార యంత్రాంగం చెబుతోంది.  

వ్యయం చేయకుండా లోటు అంటే ఎలా? 
ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలను రెవెన్యూ లోటుగా పరిగణించాలని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్ర ఆర్థికశాఖ తిరస్కరించింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో పది నెలల వ్యవధి రెవెన్యూ లోటునే మాత్రమే భర్తీ చేయనున్నట్లు చెప్పామని, పీఆర్సీ బకాయిలు చెల్లించనందున రెవెన్యూ లోటుగా ఎలా భర్తీ చేస్తామని కేంద్రం ప్రశ్నించినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. వ్యయం చేస్తేనే దాన్ని రెవెన్యూ లోటుగా పరిగణిస్తారని, అలా కాకుండా బకాయిల కింద చూపిస్తూ రెవెన్యూ లోటుగా పరిగణించటం కుదరదని అధికార యంత్రాంగం తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు చెల్లించేసి ఉంటే రాష్ట్రానికి రూ.5,325 కోట్ల మేరకు రెవెన్యూ లోటు భర్తీ రూపంలో ప్రయోజనం చేకూరేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు.  

ఇక ఇచ్చేది రూ. 138.39 కోట్లే 
రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రపతి పాలన సమయంలో రెవెన్యూ లోటును గవర్నర్‌ రూ.16,078.76 కోట్లుగా లెక్క కట్టారు. అయితే పది నెలల కాలంలో ఏర్పడిన రెవెన్యూ లోటునే పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో రెవెన్యూ లోటు రూ.15,691 కోట్లుగా పేర్కొన్నారు. అనంతరం అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం రెవెన్యూ లోటు రూ.13,775.76 కోట్లు అని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రెవెన్యూ లోటు కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ. 3,979.50 కోట్లు ఇచ్చింది. రుణమాఫీ, పింఛన్లు, డిస్కమ్స్‌ పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించిన వ్యయాన్ని రెవెన్యూ లోటుగా పరిగణించబోమని తెలిపింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో పది నెలల సమయానికి రూ.4,117.89 కోట్ల మేర మాత్రమే రెవెన్యూ లోటు ఏర్పడిందని కేంద్ర ఆర్థికశాఖ తేల్చింది. ఇందులో ఇప్పటికే రూ.3979.50 కోట్లు విడుదల చేసినందున ఇక  లోటు భర్తీ కింద కేవలం రూ. 138.39 కోట్లు మాత్రమే వస్తాయని, వీటిని త్వరలోనే విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లేఖ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేశారు.

మరిన్ని వార్తలు