రైతుల నోళ్లు కొట్టి..తమ్ముళ్ల పేర్లు దాచిపెట్టి

21 May, 2018 10:35 IST|Sakshi
మొదటి సారి ఏర్పాటు చేసిన నోటీసు బోర్డు

రెవెన్యూ రికార్డుల్లో రైతుల పేరిటఉన్న భూములు

రైతుల పేరిట పట్టాలు,పాస్‌బుక్‌లు ఉన్నా..రెవెన్యూ కిరికిరి

ఈ భూముల జాబితాలో ‘తమ్ముళ్ల’ పేర్లు మాయం  

చేతనైతే పేదలను ఆదుకోవాల్సిన రెవెన్యూ అధికారులు నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారు. పెద్దలు రూ.కోట్ల ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నా కళ్లప్పగించి చూసే వీళ్లు పేద రైతుల పేరిట పట్టాలు, పాస్‌బుక్‌లు ఉన్నా.. అవి ప్రభుత్వ భూములంటూ నిషేధాజ్ఞలు విధించారు. ఇదే భూములకు సంబంధించి కొందరు టీడీపీ నేతల పేర్లు ఉండటంతో రాత్రికి రాత్రే నోటీసు బోర్డుల్లో నుంచి ఆ పేర్లు తొలగించారంటే రెవెన్యూ అధికారులు ఎవరికి కోసం పని చేస్తున్నారో అర్థమవుతోంది. తమ తాతల కాలం నాటి నుంచి సాగు చేసుకుంటున్న భూముల్లో అడుగుపెట్టొద్దంటూ నిషేధాజ్ఞలు విధించడంపై హక్కుదారులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.

గూడూరు: గూడూరు మండలంలోని కొండాగుంట, వెంకటేశుపల్లి, తిమ్మసముద్రం, కాండ్రా గ్రామాలకు చెందిన 77 మంది రైతులు  సర్వే నంబరు 140 నుంచి 417/2 వరకూ 225.57 ఎకరాల భూములను తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నారు. మొదట్లో ఈ భూములు వెంకటగిరి సంస్థానానికి చెందినవి కాగా, ఆయా గ్రామాలకు చెందిన రైతులు తాతల కాలం నుంచి ఆ భూముల్లో పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో ఆ భూములు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలిచ్చారు. దీంతో ఆ భూములను సాగు చేసుకునే రైతుల పేరిట పట్టాదారు పాసు పుస్తకాలు, టెన్‌ వన్‌ అడంగళ్, వన్‌ బీలు కూడా ఉన్నాయి. ఆ భూముల్లో అప్పులు చేసి బోర్లు వేసుకుని నిమ్మ, యూకలిప్టస్‌ సాగు చేసుకుంటున్నారు. ఆ భూములను బ్యాంక్‌ల్లో తనఖా పెట్టి రుణాలు కూడా పొందారు. అయితే ఈ 225.57 ఎకరాల భూములు ప్రభుత్వ భూమిగా నిర్ధారిస్తూ ఆ భూమిలోకి అనుమతుల్లేకుండా ప్రవేశించిన వారు చట్టరీత్యా శిక్షార్హులంటూ ఇటీవల తహసీల్దార్‌ హెచ్చరిక నోటీసు బోర్టులు ఏర్పాటు చేశారు.

అధికార పార్టీ కుట్ర
దశాబ్దాలుగా సర్వహక్కులు కలిగి రైతులు వ్యవసాయం చేసుకుంటున్న భూములు హఠాత్తుగా ప్రభుత్వ భూములని చెబుతూ రెవెన్యూ అధికారులు నోటీసు బోర్డులు పెడుతూ నిషేధాజ్ఞలు విధించడం వెనుక అధికార పార్టీ కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూములను సాగు చేసుకుంటున్న వారిలో అత్యధికులు వైఎస్సార్‌సీపీ అభిమానులు ఉన్నారు. ఈ భూములను వారి చేతుల్లో తప్పించి, టీడీపీ నేతల పేరిట బదలాయించుకునే యత్నంగా రైతులు ఆరోపిస్తున్నారు. ఇవి ప్రభుత్వ భూములని ఎవరో ఓ వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారని, వారి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని రెవెన్యూ అధికారులు చెప్పడం అర్థరహితంగా ఉంది. ఇవి గతంలో ప్రభుత్వ భూములే అయితే అయి ఉండొచ్చు. కానీ వీటికి రెవెన్యూ అధికారులే పట్టాలు, పట్టాదారు పుస్తకాలు ఇచ్చి ఉండటం, రెవెన్యూ రికార్డుల్లో సైతం రైతుల పేర్లే ఉన్నా.. ఇవి ప్రభుత్వ భూములని ఎలా చెబుతారంటూ రైతులు ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. అధికార పార్టీలోని ముఖ్య ప్రజాప్రతినిధి ఒత్తిడితోనే  రెవెన్యూ అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ రైతుల నోళ్లు కొట్టి.. తమ్ముళ్లకు దాసోహం అవుతున్నారు.

టీడీపీ నేతల పేర్ల తొలగింపు
ఇవి ప్రభుత్వ భూములని రెవెన్యూ అధికారులు నోటీసు బోర్డులు పెట్టి, నిషేధాజ్ఞలు విధించిన తర్వాత అందులో టీడీపీ నేతల పేర్లు కూడా ఉన్నాయి. ఇవి తెలిసిన తర్వాత రాత్రికి రాత్రే ఆ టీడీపీ నేతల అధీనంలో ఉన్న 31.13 ఎకరాలకు సంబంధించి భూములను తప్పించి, 194.44 ఎకరాల్లో నిషేధాజ్ఞలు విధించారు. మొన్నా..మొన్నటి వరకు ఈ భూములకు సంబంధించి ‘మీ భూమి’ ఆన్‌లైన్‌ రెవెన్యూ రికార్డుల్లో అడంగళ్, వన్‌–బీ వివరాలు కూడా రాకుండా బ్లాక చేశారు.  గతంలో ఇదే భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడంతో నాలుగు గ్రామాలకు చెందిన రైతులు తమకు ఉన్న హక్కు ప్రతాల వివరాలతో  తహసీల్దార్‌ కార్యాలయంలో వివరణ పత్రాలు అందజేశారు. అయితే ఇప్పుడు టీడీపీ నేతలకు సంబంధించిన భూములను మినహాయించడంపై రైతులు ప్రశ్నిస్తే.. వారు రికార్డులు అందజేశారు, మీరు ఇవ్వలేదంటూ రెవెన్యూ అధికారులు బుకాయిస్తున్నారని, ఇది దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకున్న ఒకే ఒక జీవనాధారమైన ఈ భూములే లేకుండా పోతే,  తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ స్పందించి తమకు న్యాయం చేయాలంటూ వారు విజ్ఞపి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు