చుక్కల భూమిలో అమలుకాని హక్కులు

5 May, 2018 08:31 IST|Sakshi

క్రమబద్ధీకరణలో ‘రెవెన్యూ’ నిర్లక్ష్యం

చట్టం వచ్చి పదినెలలవుతున్నా ఆగని రైతన్నల ప్రదక్షిణలు

క్షేత్రస్థాయిలో విచారణ చేయని తహసీల్దార్లు

అవగాహన లేకపోవడంతో అరకొర దరఖాస్తులు

చుక్కల భూములపై యాజమాన్య హక్కులు రైతులకు దక్కేలా కనిపించడం లేదు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ భూములపై అన్నదాతలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. చట్టం వచ్చి పదినెలలవుతున్నా దీనిపై  రైతులకు అవగాహన కల్పించడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారు. దీంతో పరిమిత సంఖ్యలోనే దరఖాస్తులు అందాయి. వీటిని క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించేందుకు తహసీల్దార్లు సుముఖత చూపకపోవడంతో హక్కుల కోసం రైతన్నలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

చిత్తూరు, మదనపల్లె: జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లోనున్న చుక్కల భూముల హక్కులపై రైతులకు అవగాహన కల్పించడంలో రెవెన్యూ అధికారులు విఫలమవుతున్నారు. ఈ భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం 2017 జూన్‌ 14న చట్టం అమల్లోకి తెచ్చింది. జూలై 17న మార్గదర్శకాలను విడుదల చేసింది. భూములపై హక్కులు కల్పించాలని రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 56,378 మంది రైతులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 23 మండలాల్లోని భూములకు 985 దరఖాస్తులు అందాయి. ఇందులో చాలా దరఖాస్తులు పరిశీలనకు రాకపోవడం గమనార్హం. మదనపల్లె రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 18 మండలాల్లో 135 దరఖాస్తులను క్రమబద్ధీకరణ కోసం కలెక్టర్‌ వద్దకు పంపితే 85 పరిష్కారమయ్యాయి. అందులో 54మందికి హక్కు కల్పించి, 31మందిని వివిధ కారణాల చేత తిరస్కరించారు. జిల్లాలోని పీలేరు, వాల్మీకిపురం, కలికిరి, తంబళ్లపల్లె, మదనపల్లె మండలాల్లో ఎక్కువ సంఖ్యలో చుక్కల భూములు ఉన్నాయి.

చట్టం ఏం చెబుతోందంటే...
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1954లో భూముల రీసర్వే జరిగింది. రికార్డుల్లో సర్వే నంబర్ల వారీగా ఖాతాదారుల పేర్లు లేని భూముల వద్ద రికార్డుల్లో చుక్కలు(డాట్స్‌) పెట్టారు. చుక్కల భూముల రిజిస్ట్రేషన్లు నిషేధించేందుకు ఆ భూములను ప్రొహిబిటరీ ఆర్డర్‌ బుక్‌ (పీవోబీ) నిషేధిత జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు ఆంధ్రప్రదేశ్‌ డాటెడ్‌ ల్యాండ్స్‌ అప్‌డేషన్‌ చట్టాన్ని 2017 జూన్‌ 11న చేశారు. జూలై 17 నుంచి అమల్లోకి వచ్చింది. ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలు ఉన్న భూములకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. చట్టం చేసిన నాటికి 12 ఏళ్లు భూమి స్వాధీనానుభవంలో ఉండాలి. రైతులు ఫారం–3లో మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులను బట్టి అధికారులు గ్రామసభ నిర్వహించి ఈ భూముల రైతులను నిర్ధారించుకోవాలి. నివేదికలు ఆర్డీవోలకు, అక్కడి నుంచి జిల్లాస్థాయి కమిటీకి వెళతాయి. కమిటీ ఆరునెలల్లోగా అర్జీలను పరిశీలించి ఈ భూములకు ఆమోదం తెలిపిన తర్వాత రీసెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ కాలం(16) కింద చుక్కల స్థానంలో పట్టాదారుల పేర్లు చేర్చుతుంది.

తహసీల్దార్ల నిర్లక్ష్యం
తహసీల్దార్లు దరఖాస్తు చేసుకున్న అర్జీల ఆధారంగా క్షేత్రస్థాయిలో ఆయా సాగుదారులు ఈ భూముల్లో సాగుచేస్తున్నారా? లేదా? అనే విషయాన్ని  స్వయంగా విచారించాలి. వారితో స్టాంప్‌ పేపర్లపై అఫిడవిట్లు తయారు చేయించి నోటరీ ద్వారా నిర్థారణ చేసుకోవాలి. కాని తహసీల్దార్లు కింది స్థాయి సిబ్బంది ఇచ్చిన నివేదికలనే జిల్లాస్థాయి కమిటీలకు పంపుతున్నారు. మరోవైపు దరఖాస్తుదారులకు దస్త్రాల పేరుతో కొర్రీలు పెడుతూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. చుక్కల భూములు మిగులు చూసుకుని వాటిలో తమకు అనుకూల వ్యక్తుల పేర్లను చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు