రేషన్‌కార్డుల కోసం వసూళ్ల దందా

23 Aug, 2015 02:06 IST|Sakshi
రేషన్‌కార్డుల కోసం వసూళ్ల దందా

♦ జన్మభూమి కమిటీల పేరిట తెలుగు తమ్ముళ్ల చేతివాటం
♦ అర్హుల నుంచి రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు
 
 సాక్షి, విశాఖపట్నం :  కొత్త రేషన్‌కార్డుల జారీకి ఇటీవలే సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి జిల్లా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. రెండేళ్లుగా ఎదురు చూస్తున్న అర్జీదారుల్లో ఆశలు చిగురించా యి. గతంలో ఎన్నడూ లేనిరీతిలో జన్మభూమి కమిటీల సిఫార్సుల మేరకే రేషన్‌కార్డుల జారీ చేయాలని ఆదేశించడంతో అర్హులైన వారిలో ఎంతమందికి దక్కుతాయో అనే ఆందోళన  వ్యక్తమవుతోంది. ఇదే తరుణమన్నట్టుగా కొంతమంది దళారీలు..జన్మభూమి కమిటీల పేరిట మరికొంతమంది తెలుగుతమ్ముళ్లు వసూళ్ల దందాకు తెరతీశా రు. జిల్లాలో 10,45,838 తెలుపు, 75,889 ఏఏవై, 1035 అన్నపూర్ణ కార్డులున్నాయి.

మరో 2,10,378 గుబాబీ కార్డులున్నాయి. కొత్త కార్డుల జారీ కోసం మార్చిలోనే సర్కార్ మార్గదర్శకాలు జారీ చేసింది. ఏప్రిల్ నుంచి అమలులోకి తెచ్చిన ఈ-పాస్ విధానం ద్వారా ఉన్న రేషన్‌కార్డులకు కోతలు పెడు తూ వస్తోంది. ఇప్పటికే జిల్లాలో సుమారు రెండున్నరలక్షలకు పైగా కార్డులకు మంగళం పాడేందుకు రంగం సిద్దం చేసింది. నెలాఖరులోగా వీటి రద్దు విషయమై అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ చేత్తో తొలగించినప్పటికీ...ఆ చేత్తో కొత్త కార్డులు ఇచ్చామని చెప్పుకునేందుకు సర్కార్ ఆదేశాలిచ్చింది. కొత్త  రేషన్‌కార్డులను స్మార్ట్ తరహాలో జారీ చేయాలని నిర్ణయించారు.

కార్డుల కోసం లక్షన్నరకు పైగా అర్జీలొచ్చాయి. నగర పరిధిలో 60వే లు, గ్రామీణ ప్రాంతంలో మరో 75వేల అర్జీలకు అర్హమైనట్టుగా నిర్ధారించి ఆధార్‌తో అనుసంధానం చేసి అప్‌లోడ్ చేశారు. జాబితాలను జన్మభూమి కమిటీలకు అప్పగించారు. వారు క్షేత్ర స్థాయిలో పరిశీలించి స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సు మేరకు అర్హులైన వారితో జాబితాను తయారుచేసి ప్రభుత్వానికి పంపించాల్సి ఉంది. అధికారికంగా ఇప్పటికే అర్హుల జాబితా సిద్దమైనప్పటికీ కొంతమంది దళారీలు అందినకాడకి దండుకుంటున్నారు. మరొక పక్క జన్మభూమి కమిటీల పేరిట కొంతమంది తెలుగుతమ్ముళ్లు అర్హుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి. నగర పరిధిలోనే కాదు..గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ దందా కొనసాగుతున్నట్టు తెలు స్తోంది. ఒక్కొక్కరి నుంచి రూ.500నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
 
 దళారీల వలలో పడొద్దు
 ఎవరూ దళారీలవలలో పడొద్దు. అర్హుల నిర్ధారణ ఇప్పటికే పూర్తయ్యింది. ఈసారి స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. ఎవరికి ఎలాంటి సొమ్ములు చెల్లించకండి. వసూళ్లకు పాల్పడే వారి వివరాలను తెలియజేస్తే కఠినచర్యలు తీసుకుంటాం.
 - జే.శాంతకుమారి, డీఎస్‌ఒ

మరిన్ని వార్తలు