అక్రమాల రెవెన్యూ

7 Jan, 2016 00:21 IST|Sakshi
అక్రమాల రెవెన్యూ

ఖాళీ స్థలాల పన్ను వసూళ్లలో చేతివాటం
ఇరిగేషన్ స్థలం ప్రైవేటు పరం
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ ఫిర్యాదుతో వెలుగులోకి
విచారణకు ఆదేశించిన కమిషనర్

 
నగరపాలక సంస్థ రికార్డుల ప్రకారం ఖాళీ స్థలాల పన్ను బకాయి రూ.50 కోట్ల పైనే ఉంది. పన్ను వసూళ్లలో అలసత్వం వహించే అధికారులు రికార్డుల్లో లేని స్థలాలకు వీఎల్‌టీ వసూలు చేస్తున్నారు. దొడ్డిదారిన స్థలాన్ని దోచిపెట్టేందుకు హడావుడిగా డిమాండ్ నోటీసులు ఇచ్చి పన్ను వసూలు చేశారు.  ఒకే అసెస్‌మెంట్ నంబర్‌లో ఉన్న మూడు స్థలాలకు నాలుగేళ్ల తేడాతో పన్ను వసూలు చేయడమే ఇక్కడ ట్విస్ట్. ఫిర్యాదు అందడంతో కమిషనర్ విచారణకు ఆదేశించారు.
 
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పన్ను వసూళ్లలో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏటా కోట్లాది రూపాయల కార్పొరేషన్ ఆదాయానికి గండికొడతున్నారు. సర్కిల్-2 పరిధిలోని పూర్ణానందంపేటలోని భూపతి సెస్మిక్  కంపెనీకి సంబంధించి ఖాళీ స్థలాల పన్ను వసూళ్లలో రెవెన్యూ అధికారులు మాయాజాలం చూపారు. అసెస్‌మెంట్ నంబర్ 12054లోని 2,500 గజాలకు రూ.3.25 లక్షలు, 12054ఏ లోని 2,500 గజాలకు రూ.3.25 లక్షలు చొప్పున 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖాళీ స్థలాల పన్ను వసూలు చేశారు. 12054పీ  లోని 888 గజాలకు రూ.1,99,800లు 2010 నుంచి వసూలు చేశారు. అదే స్థల యజమానికి సంబంధించి మరో 2,100 గజాల స్థలానికి ఖాళీ స్థలాల పన్ను వసూలు చేయలేదు. డాక్యుమెంట్‌లో మొత్తం 7,988 గజాలు ఉండగా 5,888 గజాలకు వేర్వేరు సంవత్సరాల్లో పన్నులు వసూలు చేయడంతో అనుమానం రెకెత్తింది.

వెలుగులోకి వచ్చింది ఇలా..
అసెస్‌మెంట్ నంబర్ 12054/పి లోని 888 గజాల స్థలం ఇరిగేషన్‌శాఖకు సంబంధించింది కాగా పన్ను ఎలా వసూలు చేశారంటూ 41వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ పైడిమాల సుభాషిణి రెవెన్యూ అధికారులను నిలదీశారు. వారి నుంచి స్పందన రాకపోవడంతో కమిషనర్ జి.వీరపాండియన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాల్సిందిగా సర్కిల్-2 ఇన్‌చార్జి అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్‌ను ఆదేశించారు. గతంలో నాగకుమారి సర్కిల్-2 ఏసీగా విధులు నిర్వర్తించిన సమయంలోనే ఈ అసెస్‌మెంట్లకు సంబంధించి పన్నులు వసూలు చేసినట్లు రికార్డుల్లో ఉంది. సుమారు రూ.20 లక్షలు ఖాళీస్థలాల పన్ను రూపంలో రావాల్సి ఉండగా రూ.8,49,800 మాత్రమే వసూలు చేసినట్లు భోగట్టా. ఇరిగేషన్ స్థలానికి సంబంధించి పన్ను విధింపునకు భారీగానే ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కిల్-2 పరిధిలో పన్ను వసూళ్లలో పెద్ద ఎత్తున గోల్‌మాల్ చోటుచేసుకుందనే విమర్శలున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అక్రమార్కుల్లో వణుకుపుడుతోంది.
 
అంతా అడ్డగోలే
రెవెన్యూ అధికారులు 888 గజాలకు సంబంధించి అడ్డగోలుగా పన్ను విధించారు. దీనివల్ల ప్రభుత్వ స్థలం ప్రైవేటు పరమైంది. డాక్యుమెంట్‌లో ఉన్న స్థల విస్తీర్ణానికి వసూలు చేసిన పన్నుకు భారీగా వ్యత్యాసం ఉంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే పరిస్థితి ఇంత అధ్వానంగా తయారైంది. సర్కిల్-2లో ఇలాంటి అక్రమాలు చాలానే జరిగినట్లు తెలుస్తోంది. సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
 -పైడిమాల సుభాషిణి
 41వ డివిజన్ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్
 
విచారణ చేస్తున్నాం..
కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నా. త్వరలోనే నివేదిక అందజేస్తా. పన్ను వసూళ్లలో తేడాల విషయం ఇప్పుడే చెప్పలేను. ఎవరైనా నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. అక్రమాలు రుజువైతే బాధ్యులపై చర్యలు ఉంటాయి.
 -సుధాకర్ అసిస్టెంట్ కమిషనర్
 సర్కిల్-2 ఇన్‌చార్జి
 

>
మరిన్ని వార్తలు