రెవెన్యూ లీలలు

13 May, 2017 12:57 IST|Sakshi

► వీఆర్‌ఏకు రూ.కోట్ల విలువైన భూమి ధారాదత్తం  
► అసైన్‌మెంట్‌లో పొందిన భూమిలో రియల్‌ వ్యాపారం
► చోద్యం చూస్తున్న అధికారులు
 

రాయచోటి రూరల్‌:  అసైన్‌మెంట్‌ భూపంపిణీలో రెవెన్యూ లీలలు కొనసాగుతున్నాయి. రాయచోటి పట్టణ పరిసర ప్రాంతాల్లో రూ.కోట్ల విలువైన భూమిని ఇష్టారాజ్యంగా రెవెన్యూ అధికారులు తమ శాఖ సిబ్బందికే ధారాదత్తం చేయడం గమనార్హం. రెవెన్యూశాఖలో విధులు నిర్వహిస్తున్న పలువురు అధికారులు, కిందిస్థాయి ఉద్యోగుల చేతివాటంతో ప్రభుత్వ , డీకేటీ భూములు ప్లాట్లుగా మారిపోతున్నాయి. రూ.లక్షలు అధికారుల జేబుల్లోకి పోతున్నాయి.

వివరాల్లోకి వెళితే..రాయచోటి మండలం పెమ్మాడపల్లెకి చెందిన డీకేటీ భూమి 2005 నుంచి సుమారు 19 ఎకరాలు అక్రమంగా అనర్హులకు రెవెన్యూ అధికారులు ధారాదత్తం చేసినట్లుÐð వెల్లడైంది. పెమ్మాడపల్లె రెవెన్యూ గ్రామంలో విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కదిరప్ప కుమారుడు శివమల్లయ్య పేరుతో రింగ్‌రోడ్డు పక్కనే రూ.కోట్ల విలువైన డీకేటీ భూమి  6 ఎకరాలు ఉన్నట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది.

శివమల్లయ్య పేరుతో పాసుపుస్తకం ఖాతా నంబర్‌ 456లో సర్వేనంబర్‌ 364/12బిలో 1.17ఎకరాలు, 364/14లో 0.48ఎకరాలు, 364/1ఇలో 0.63ఎకరాలు, 364/4లో 0.99ఎకరాలు, 364/7లో 0.28ఎకరాలు, 374/5లో 0.14సెంట్లు, 385లో 0.17ఎకరాలు, 397/1లో 0.40 ఎకరాలు, 406లో 1.03 ఎకరాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇష్టారాజ్యంగా పంపిణీ
అనంతపురం జిల్లా ఎన్‌పీకుంట(పలువురు చెప్పిన అడ్రస్‌ ప్రకారం)కు చెందిన మేళ్ల చెరువు రామకృష్ణనాయుడు అనే వ్యక్తికి రాయచోటి మండలం పెమ్మాడపల్లెలో ఖాతా నంబర్‌ 558లో సర్వే నంబర్‌ 364/11లో 1.20ఎకరాలు, 364/12లో 1.16 ఎకరాలు డీకేటీ భూమి ఉన్నట్లు రికార్డులున్నాయి. దీంతో పాటు అదే రామకృష్ణనాయుడు పేరుతో మరో 9 సర్వే నంబర్లలో సుమారు 6ఎకరాలకు పైగా ఉండటం గమనార్హం. ఈ భూపంపిణీలో కూడా అప్పటి రెవెన్యూ అధికారులు చేతివాటం చూపినట్లు తెలుస్తోంది.

అదే గ్రామంలో 362/4 సర్వే నంబర్‌లో ఒక వ్యక్తికి 2 ఎకరాలు డీకేటీ భూపంపిణీలో భాగంగా ఇవ్వగా, 2 ఎకరాలతో పాటు మరో 6 ఎకరాలను కబ్జా చేసుకుని చుట్టూ కంచె వేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా రాయచోటి రింగ్‌రోడ్డు వద్ద రోడ్డుకు ఇరువైపులా  రూ.కోట్లు విలువ చేసే సుమారు 19 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా పొందిన వ్యక్తులు, మరో 10 ఎకరాల ప్రభుత్వ భూమిపైనా కన్నేశారు. వారి భూమికి పక్కనే ఖాళీగా ఉన్న డీకేటీ భూమిని కబ్జా చేయడం విశేషం.

అసైన్‌మెంట్‌ భూముల్లో రియల్‌ వ్యాపారం
2005 తర్వాత పలు దఫాలుగా అక్రమంగా అర్హతలేని వ్యక్తులు పెమ్మాడపల్లెలో రాయచోటి రింగ్‌రోడ్డుకు ఇరువైపులా భూములను పొందారు. దీంతో పాటు చేతికందినంత ఆక్రమించుకుని ప్రస్తుతం ఆ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాల కోసం అవసరమైన వ్యక్తులు వారి చేతుల్లో పడి మోసపోతున్నారు. నిబంధనలకు విరుద్ధం గా డీకేటీ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండటం విశేషం.

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు
–గుణభూషణరెడ్డి, తహసీల్దార్‌ ,రాయచోటి
ప్రభుత్వభూములను ఆక్రమించినా, నిబంధనలకు విరుద్ధంగా అసైన్‌మెంట్‌ భూముల్లో వ్యాపార లావాదేవీలు చేసినా చర్యలు తప్పవు. డీకేటీ భూములను ఇళ్ల నిర్మాణం కోసం కొంటే ప్రజలే మోసపోతారు. వాటిని ప్రభుత్వ ఆదేశాలతో మళ్లీ స్వాధీనం చేసుకుంటాం. ఒకవేళ అసైన్‌మెంట్‌లో భూమి పొందిన అన్ని అర్హతలు ఉన్నవారు కూడా ప్రభుత్వం నుంచి ఎన్‌ఓసీతో పాటు పట్టా పొందాల్సి ఉంటుంది.
 

>
మరిన్ని వార్తలు