మజాగా పెద్దలు

3 Aug, 2015 01:20 IST|Sakshi

 చీపురుపల్లి: మండలంలో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని తలపెట్టినా ప్రభుత్వ భూములు లేవని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలో ఉన్నా వాటి స్వాధీనానికి అధికారులు ప్రయత్నించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెదనడిపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 28లో 16 ఎకరాల ప్రభుత్వ భూమి ఎంతో కాలంగా గరివిడికి చెందిన ఓ మైనింగ్ పరిశ్రమ యాజమాన్యం చేతుల్లో ఉన్నాయి. ఈ భూముల్లో పెద్ద ఎత్తున ఆయిల్‌పామ్ తోటలు కూడా ఉన్నాయి.
 
 ఈ పరిశ్రమ అధినేతకు అధికార పార్టీ నేతల అండదండలుండటంతో అధికారులు వాటి జోలికి వెళ్లలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. అవి ప్రభుత్వ భూములని రికార్డుల్లో నమోదైనా పట్టించుకోకపోవడం విశేషం. మూడేళ్ల క్రితం ఈ భూములు ప్రభుత్వానివేనని అప్పటి తహశీల్దార్ మజ్జి శంకరరావు వెల్లడించడం తెలిసిందే. దీంతో అప్పట్లో ఈ భూములను విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి కేటాయించేందుకు కూడా సిద్ధమయ్యారు. పెదనడిపల్లి గ్రామానికి చెందిన కొందరు దళితులు ఈ భూముల్లో తమకు ప్రభుత్వం గతంలో పట్టాలు ఇచ్చిందని,
 
  విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి ఒప్పుకోమని అడ్డు తగలడంతో
 ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం విరమించుకుంది. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే సమయానికి ఆ తహశీల్దార్‌కు బదిలీ కావడంతో ఈ విషయం మరుగున పడింది. ప్రస్తుతం ఒక్కో ఎకరం రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల విలువ చేస్తుంది. దాదాపు రూ.70 లక్షల విలువైన ప్రభుత్వ భూముల స్వాధీనానికి చర్యలు ప్రారంభించాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు. దీనిపై తహశీల్దార్ డి.పెంటయ్యను వివరణ కోరగా పదహారు ఎకరాలు ప్రభుత్వ భూములేనని ధ్రువీకరించారు. ఈ వివాదంపై జాయింట్ కలెక్టర్ కోర్టులో జరిగిన విచారణలో అవి ప్రభుత్వ భూములేనని తేలిందని స్పష్టం చేశారు. కబ్జాదారు దీనిపై సీసీఎల్‌ఏకు అప్పీలు చేయడంతో పెండింగ్‌లో ఉందని, తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వివరించారు.
 

మరిన్ని వార్తలు