ఎస్‌ఆర్‌కు చెక్‌! 

4 Aug, 2019 07:43 IST|Sakshi

మైనింగ్‌ డీడీకి ఆదేశాలు  

ఇసుక అక్రమ రవాణా వాస్తవమని ప్రాథమికంగా తేల్చిన రెవెన్యూ అధికారులు

సాక్షి ప్రతినిధి, అనంతపురం : టీడీపీ నేత, ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత అమిలినేని సురేంద్రబాబు సాగిస్తున్న ఇసుక అక్రమ రవాణాకు చెక్‌ పడింది. ‘ఇసుక దిబ్బల్లో కాంట్రాక్టు గద్ద’ శీర్షికన శనివారం ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో రెవెన్యూ అధికారులు కళ్లు తెరిచారు. పరిగి మండలంలోని శాసనకోట వద్ద ఇసుక రవాణాను వెంటనే నిలిపివేయించడంతో పాటు మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని మైనింగ్‌ డీడీని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ ఆదేశించారు. జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా పెన్నా నది మీద బ్రిడ్జి నిర్మాణానికి ఇసుక కావాలంటూ ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ దరఖాస్తు చేసుకోగా ఐదు వాహనాలకు పరిగి తహసీల్దారు అనుమతి మంజూరు చేశారు.

అయితే అనుమతించిన వాహనాల్లో కాకుండా ఇతర వాహనాల్లో రోజూ 10 ట్రక్కులకు పైగా ఇసుకను ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ నిర్వాహకులు తరలిస్తున్నారు. అదీ కూడా ఇసుక తరలింపునకు అనుమతిచ్చిన బాల్‌రెడ్డిపల్లి నుంచి కాకుండా శాసనకోట నుంచి ఇసుక తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకున్నారు. ఈవిధంగా గత మూడు నెలల కాలంలో ఏకంగా రూ.10కోట్లకు పైగా ఆర్జించినట్లు ‘సాక్షి’ ఆధారాలతో సహా ప్రచురించింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు శాసనకోట ప్రాంతాన్ని పరిశీలించి రీచ్‌ లేకపోయినప్పటికీ ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ భారీగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినట్లు నిర్ధారించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు హెచ్చరిక జారీ చేశారు. 

విచారణకు ఆదేశం  
జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న విషయమై మైనింగ్‌ డీడీని విచారణకు ఆదేశించాం. ప్రభుత్వ పాలసీకి భిన్నంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవు. మైనింగ్‌ డీడీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. 
– ఎస్‌.సత్యనారాయణ, జిల్లా కలెక్టర్‌    

మరిన్ని వార్తలు