రెవెన్యూ రికార్డుల తారుమారు

27 Jan, 2020 12:50 IST|Sakshi
రెవెన్యూ రికార్డులలో 146/1 సర్వే నంబర్‌ లేదని తహసీల్దార్‌ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం

భూములు లేకపోయినా అగ్రిగోల్డ్‌ పేరిట రిజిస్ట్రేషన్‌

అమ్మిన భూములకే  తిరిగి పాసుపుస్తకాలు

టీడీపీ నాయకుల దందా

‘రామకృష్ణాపురం’ నాయకుడికీలకపాత్ర

కర్నూలు, కోడుమూరు:  అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో సీబీసీఐడీ అధికారులు శోధించే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. కృష్ణగిరి, రామకృష్ణాపురం, తాళ్ల గోకులపాడు గ్రామాల్లో అగ్రిగోల్డ్‌ సంస్థ దాదాపు 700 ఎకరాల భూములను కొనుగోలు చేసింది. ఇందులో ఎక్కువగా టీడీపీ నాయకులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించిన ఆధారాలను సీబీసీఐడీ అధికారులు సేకరించారు. రెవెన్యూ రికార్డులలో లేని సర్వే నంబర్లను సృష్టించి రిజిస్ట్రేషన్లు చేశారు. అలాగే విస్తీర్ణం తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువగా చూపి రిజిస్ట్రేషన్‌ చేశారు. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రధాన అనుచరుడు, రామకృష్ణాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పి.దామోదర్‌నాయుడు అగ్రిగోల్డ్‌కు భూములమ్మి..ఆ తర్వాత వాటి రికార్డులను తారుమారు చేసి భార్య వరలక్ష్మీ పేరుమీద పట్టాదారు పాసు పుస్తకం తెచ్చుకున్నాడు. అలాగే దాదాపు 150 ఎకరాల భూములు క్షేత్రస్థాయిలో లేకపోయినప్పటికీ టీడీపీ నాయకులు అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు సీబీసీఐడీ అధికారుల విచారణలో బయటపడింది. అప్ప ట్లో పనిచేసిన తహసీల్దార్లు సత్యం, సూర్యనారాయణ సంతకాలతో రైతులకు భూములు ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు తీసుకుని.. బోగస్‌ వ్యక్తులతో రిజిస్ట్రేషన్లు చేయించినట్లు  గుర్తించారు. అధికారుల సంతకాలు ఫో ర్జరీవా?  నిజమైనవా? తేల్చేందుకు ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు తెలిసింది.

దామోదర్‌ నాయుడు సోదరుడు పి.వెంకటయ్య, నారాయణ స్వామి, ధనుంజయ, బోయ గిడ్డమ్మలు కలిసి 113, 146/1 సర్వే నంబర్లలోని 13.19 ఎకరాల భూమిని అగ్రిగోల్డ్‌కు చెందిన గోల్డెన్‌ వుడ్‌ ట్రేడర్స్‌ రియల్టర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ యజమాని సీతారామారావుకు విక్రయించారు. డాక్యుమెంట్‌ నంబర్‌ 1760/2009. వాస్తవానికి సర్వే నంబర్‌ 146/1 రెవెన్యూ రికార్డులలో లేకపోయినప్పటికీ అందులో 9.07 ఎకరాల భూమి ఉన్నట్లు చూపి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించిన విషయం సీబీసీఐడీ విచారణలో బయటపడింది. అలాగే అగ్రిగోల్డ్‌కు అమ్మిన భూమిలో 4.12 ఎకరాలను  దామోదర్‌ నాయుడు తన భార్య పి.వరలక్ష్మీ పేరిట బదలాయించి..పట్టాదారు పాసు పుస్తకం (ఖాతా నంబర్‌ 505) కూడా తీసుకున్నారు.

సర్వే నంబర్‌ 149/బీ, 80/1, 137/డీ, 40/2లలో పి.రామాంజినేయులు, కొండేటి పుల్లయ్య, పి.పార్వతమ్మ, బోయ శేషమ్మలకు 22.78 ఎకరాల భూమి ఉన్నట్లు (డాక్యుమెంట్‌ నెం.4497/2009) చూపి మాతంగి ఇన్‌ఫ్రా వెంచర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధులకు రిజిస్ట్రేషన్‌ చేయించారు. 40/ 2 సర్వే నంబర్‌లో రెవెన్యూ రికార్డుల ప్రకారం పూర్తి విస్తీర్ణం 2.72 ఎకరాలు మాత్రమే ఉండగా..ఏకంగా 10.61 ఎకరాలు రిజిస్ట్రేషన్‌ చేయించడం గమనార్హం. ప్రస్తుతం అగ్రిగోల్డ్‌కు విక్రయించిన పై సర్వే నంబర్‌లలో భూముల్లో కేబీ మద్దయ్య (ఖాతా నంబర్‌ 263), కృష్ణ (1139), బోయ సాయిలీల (1267), మురళీధర్‌ (ఖాతా నం 932), వల్లె ఓబులేసు (ఖాతా నం 615) సాగులో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. రెవెన్యూ రికార్డుల గోల్‌మాల్‌పై సీబీసీఐడీ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా