దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలి

17 May, 2019 12:39 IST|Sakshi
టెక్కలి: ఆర్డీఓకు వినతిపత్రం అందిస్తున్న రెవెన్యూ సిబ్బంది

సాక్షి, టెక్కలి: శ్రీకాకుళం మండలం పరిధిలో అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకోవాలని ప్రయత్నించిన వీఆర్‌ఓలపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వీఆర్‌ఓ, రెవెన్యూ అసోసియేషన్‌ ప్రతినిధులు టెక్కలి ఆర్డీఓ ఎస్‌.భాస్కర్‌రెడ్డికి వినతిపత్రం గురువారం అందజేశారు. భైరి, కరజాడ, బట్టేరు, పొన్నాం, నైరా ప్రాంతంలో రాత్రి సమయంలో అక్రమ ఇసుక మాఫియాను అడ్డుకోవాలని ప్రయత్నించిన వారిపై దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే కొన్ని సందర్భాల్లో విధులు చేపడుతున్న వీఆర్‌ఓ లకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
నందిగాం: ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న వీఆర్వోలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల పరిధిలోని వీఆర్వో సంఘం ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా గాయాలపాలై ఆస్పత్రిలో ఉన్న వీఆర్వోలు చంద్రశేఖర్, విశ్వేశ్వర్రావు లకు సంఘీభావంగా మధ్యాహ్నం భోజన సమయంలో స్థానిక తహసీల్దారు కార్యాలయ ఆవరణలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం రూరల్‌ పరిధిలోని నైరా వద్ద గురువారం రాత్రి  ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునేందుకు వెళ్లిన వీఆర్వోలపై దాడి చేయడం హేయమైన చర్యన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడి చేయడం తగదని హితవు పలికారు. అలాగే దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరసనలో వీఆర్వోలు సురేష్, అప్పన్న, మురళీ, రాంజీ, వైకుంఠరావు, ఖగేశ్వర్రావు, కృష్ణారావు, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు