ఆదాయానికి కేసుల గండం

11 Jan, 2016 01:08 IST|Sakshi

వివిధ కోర్టుల్లో 902 కేసులు పెండింగ్
నగరపాలక సంస్థ ఆదాయానికి గండి
పరిష్కారమైతే కాసుల పంటే

 
అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం వెరసి నగరపాలక సంస్థ ఆదాయానికి గండిపడుతోంది. సకాలంలో కోర్టు కేసులను  పరిష్కరించడంలో విఫలమవుతున్నారు. దీంతో కోర్టులో కేసులు పేరుకుపోతున్నాయి.
 
విజయవాడ సెంట్రల్ : కార్పొరేషన్‌లో రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్, ప్రజారోగ్యశాఖలకు సంబంధించి వివిధ కోర్టుల్లో 902 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిష్కరించగలితే రూ.50 కోట్లపైనే నగరపాలక సంస్థకు ఆదాయం వస్తోందని అంచనా.
 హైకోర్టులో 556, స్థానిక కోర్టులో 269, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో 31, ఏపీ వినియోగదారుల ఫోరంలో 2, సుప్రీం కోర్టులో ఒకటి, లోకాయుక్తాలో 19, ప్రీలిటిగేషన్ కౌన్సిల్ (పీఎల్‌సీ)లో 22, హ్యూమన్ రైట్స్ కమిషన్ వద్ద 2 చొప్పున వెరసి 902 కేసులు ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిష్కరించడంలో లీగల్‌సెల్ శ్రద్ధ చూపడం లేదనే వాదనలు ఉన్నాయి.
 

కొనసా..గుతున్నాయి
కార్పొరేషన్‌కు దండిగా ఆదాయం తెచ్చిపెట్టే టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, ఎస్టేట్స్, ప్రజారోగ్యశాఖలకు సంబంధించిన కేసులే ఎక్కువ పెండింగ్‌లో ఉంటున్నాయి. వస్త్రలత నుంచి రూ.11 కోట్లు, ఐవీ ప్యాలెస్ నుంచి రూ.7 కోట్లు రాబట్టాల్సి ఉంది. షాపుల, పార్కింగ్‌స్టాండ్ల అద్దెలకు సంబంధించి ఆయా యజమానులు ఇస్తున్న చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. ప్రతినెలా    సుమారు రెండు వందల చెక్కులు బౌన్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు బాధ్యులపై పోలీసు కేసులు పెట్టకపోవడంతో ఇదో ప్రహసనంలా మారింది. వస్త్రలత బకాయిల పరిష్కారానికి సంబంధించి వ్యాపారులతో ఎంపీ కేశినేని నాని, మేయర్ కోనేరు శ్రీధర్ పలుమార్లు చర్చలు జరిపారు. బకాయిల్లో పది శాతం కంటే మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదని కమిషనర్ జి.వీరపాండియన్ స్పష్టం చేయడంతో కేసులు కొనసా..గుతున్నాయి.
 
 దృష్టిపెడతాం
 నగరపాలక సంస్థకు సంబంధించి పెండింగ్ కేసులపై దృష్టిసారిస్తాం.   హైకోర్టులో కేసులు వాదించేందుకు ప్రభుత్వం ఇటీవలే ఆర్. సుధీర్‌ను నియమించింది. పెండింగ్ కేసుల విషయమై త్వరలోనే ఆయనతో చర్చిస్తాం. వివిధ శాఖల అధికారులు సహకరించాలి. పెండింగ్‌లో ఉన్న కేసుల్ని త్వరితగతిన పరిష్కరించినట్లైతే ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
 -కోనేరు శ్రీధర్, మేయర్, నగరపాలక సంస్థ

మరిన్ని వార్తలు