తెలుగుగంగలో ‘రివర్స్‌’

10 Dec, 2019 04:34 IST|Sakshi

లైనింగ్‌ పనులకు నోటిఫికేషన్‌ 

23 వరకు షెడ్యూళ్ల దాఖలుకు అవకాశం 

27న ప్రైస్‌ బిడ్‌.. అదేరోజు ఈ–ఆక్షన్‌ 

గత సర్కారు అధిక ధరలకు కట్టబెట్టడం వల్ల ఖజానాపై రూ.30.81 కోట్ల భారం 

‘రివర్స్‌’తో భారీగా ఆదా అవుతుందంటున్న అధికారులు  

సాక్షి, అమరావతి: తెలుగుగంగ ప్రధాన కాలువలో మిగిలిపోయిన లైనింగ్‌ పనులకు రూ.239.04 కోట్లతో సోమవారం రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో షెడ్యూళ్ల డౌన్‌లోడ్, దాఖలుకు ఈనెల 23వ తేదీ తుదిగడువు. 24న ప్రీ–క్వాలిఫికేషన్‌ బిడ్‌ తెరుస్తారు. 27న ఉదయం 11 గంటలకు ప్రైస్‌ బిడ్‌ తెరిచి ఎల్‌–1గా నిలిచిన కాంట్రాక్టర్‌ కోట్‌ చేసిన ధరనే కాంట్రాక్టు విలువగా పరిగణించి అదేరోజు మధ్యాహ్నం రివర్స్‌ టెండరింగ్‌ (ఈ–ఆక్షన్‌) నిర్వహిస్తారు. అత్యంత తక్కువ ధరకు కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌కు పనులు కేటాయించాల్సిందిగా సూచిస్తూ సీవోటీ(కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌)కి ప్రతిపాదనలు పంపనున్నారు.

గతంలో సీఎం రమేష్‌ సంస్థకు పనులు.. 
- తెలుగుగంగ ప్రధాన కాలువలో లైనింగ్‌ పనులకు రూ.239.04 కోట్లతో ఎన్నికలకు రెండు నెలల ముందు టీడీపీ సర్కార్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
మాజీ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ పాటు ష్యూ (ఎస్‌ఈడబ్ల్యూ) ఇన్‌ఫ్రా సంస్థ షెడ్యూళ్లు దాఖలు చేయగా సాంకేతిక బిడ్‌లో ‘ష్యూ’పై అనర్హత వేటు వేశారు.  
అనుభవం ఉన్నట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన రిత్విక్‌పై వేటు వేయాలని ‘ష్యూ’ సంస్థ ఆధారాలతో ఫిర్యాదు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాలను తుంగలో తొక్కి అధిక ధరలకు కోట్‌ చేసిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ సింగిల్‌ బిడ్‌ను ఆమోదించింది. దీనివల్ల ఖజానాపై రూ.6.91 కోట్ల భారం పడింది.
పారదర్శకంగా టెండర్లు నిర్వహించి ఉంటే కనీసం పది శాతం తక్కువ ధరలకే పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొచ్చి ఖజానాకు రూ.23.90 కోట్లు మిగిలేవి. కానీ గత సర్కార్‌ అధిక ధరలకు పనులు కట్టబెట్టడం వల్ల మొత్తమ్మీద ఖజానాపై రూ.30.81 కోట్ల భారం పడింది. 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక అక్రమాలను గుర్తించి ఈ కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసింది. ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాల మేరకు తెలుగుగంగ అధికారులు రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ పనుల్లో ఖజానాకు భారీ ఎత్తున ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా