ప్రశాంత ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

16 Mar, 2019 14:08 IST|Sakshi
కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎస్పీ దామోదర్, ఇతర పోలీసు అధికారులు 

సాక్షి, విజయనగరం టౌన్‌:  జిల్లాలో సార్వత్రిక ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లను రాష్ట్ర డీజీపీ ఆర్‌పి.ఠాగూర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శుక్రవారం సమీక్షించారు.  ఈ సందర్భంగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో విశాఖ రేంజ్‌ డీఐజీ పాలరాజు,  ఎస్పీ ఎఆర్‌.దామోదర్‌ పాల్గొన్నారు.  జిల్లాలో సార్వత్రిక ఎన్నికల  దృష్ట్యా పోలీస్‌ శాఖ చేపడుతున్న భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాట్లు, వాహన తనిఖీలు గురించి  ఎస్పీ  దామోదర్‌ రాష్ట్ర డీజీపీ ఆర్‌.పి.ఠాగూర్‌కు వివరించారు.

విశాఖ రేంజ్‌ డీఐజీ పాలరాజు విశాఖ రేంజ్‌ పరిధిలో చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను డీజీపీకీ వివరించారు. రాష్ట్ర డీజీపీ ఆర్‌పి.ఠాగూర్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ ఒకేసారి చేపడుతున్నందున  పోలీస్‌ ఫోర్సును చక్కని ప్రణాళికతో వినియోగించాలని ఆదేశించారు. పారా మిలిటరీ దళాలను ప్రతీ జిల్లాకు కేటాయిస్తున్నామని చెప్పారు. ఈ పారా మిలిటరీ దళాల సహకారంతో స్ధానిక వాహన తనిఖీలు నిరంతరం చేపట్టాలని, గ్రామ సందర్శనలో కూడా వీరి సేవలను వినియోగించుకోవాలన్నారు.

ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే ప్రత్యేక ఫ్‌లైయింగ్‌ స్క్వాడ్‌లు, స్టేటిక్‌ సర్విలైన్స్‌ బృందాలు, అంతర్రాష్ట్ర, అంతర జిల్లా చెక్‌పోస్టులు వద్ద తనిఖీలను  పూర్తి స్థాయిలో చేపట్టాలని అధికారులను డీజీపీ ఆదేశించారు. వాహన తనిఖీలను చేపట్టే సమయంలో అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని, సీజ్‌ చేసిన నగదు, మద్యం, గుట్కాలు, ఎన్నికల సామగ్రి వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలని పోలీస్‌ అధికారులకు డీజీపీ ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో విశాఖ రేంజ్‌ డీఐజీ పాలరాజు, ఎస్పీ ఎఆర్‌.దామోదర్, అదనపు ఎస్పీ ఎమ్‌.నరసింహారావు, ఓఎస్‌డీ జె.రామ్మోహనరావు, ఎస్‌బీ డీఎస్పీ సిఎమ్‌.నాయుడు, విజయనగరం డీఎస్పీ డి.సూర్యశ్రావణ్‌ కుమార్, ట్రాఫిక్‌ డీఎస్పీ ఎమ్‌.శ్రీనివాసరావు, సీసీఎస్‌ డీఎస్పీ జె.పాపారావు, ఎస్‌బీ సీఐ జి.రామకృష్ణ, బి సెక్షన్‌ సూపరింటెండెంట్‌ గోపీనాథ్, కమ్యూనికేషన్‌ సీఐ రమణమూర్తి ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు