ఎండల తీవ్రతపై సీఎస్‌ సమీక్ష

5 May, 2019 17:11 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎండల తీవ్రతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదివారం సమీక్ష నిర్వహించారు.  ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజల్లో అవగాహన పెంచి జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా విస్తృతస్థాయిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, తాగునీటితో పాటు, మజ్జిగ కూడా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలను చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని అన్నారు. ఆస్పత్రులు, దేవాలయాలు, చర్చ్‌లు, మసీదులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లలో తాగునీటి వసతి కల్పించాలని, ప్రజలకు అందుబాటులో ఉండేలా మందులు, అంబులెన్సులతో వైద్యబృందాలు సిద్ధంగా ఉండాలన్నారు. పశువుల కోసం నీళ్లు నింపిన తొట్టెలు ఏర్పాటు చేయాలని, వేసవి కాలంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై ప్రజలకు మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని సీఎస్‌ సూచనలు చేశారు.  

కాగా రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారిన విషయం తెలిసిందే. పలుచోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇక తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం పాత కోరంగిలో వడదెబ్బ తగిలి వృద్ధ దంపతులు మృతి చెందారు. నిన్న వ్యవసాయ పనులకు వెళ్లిన గుబ్బల కామరాజు, సుభద్రమ్మ వడదెబ్బకు గురయ్యారు. ముందుగా భార్య, అనంతరం భర్త మృతి చెందాడు.

మరిన్ని వార్తలు