శ్రీవారి దర్శనం రద్దుపై టీటీడీ పునరాలోచన

18 Jul, 2018 02:32 IST|Sakshi
శ్రీవారి ఆలయం

బోర్డును తప్పుదోవపట్టించారని అధికారిపై చైర్మన్‌ ఆగ్రహం

దర్శనాలు కొనసాగించాలని టీటీడీకి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని తాజాగా నిర్ణయం

24న పాలకమండలి సమావేశంలో శ్రీవారి దర్శనంపై ప్రకటన

సాక్షి, తిరుపతి:  శ్రీవారి దర్శనం రద్దుపై తిరుమల తిరుపతి దేవస్థానం పునరాలోచనలో పడింది. మహా సంప్రోక్షణ సమయంలో పరిమితంగా భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించే విషయంపై చర్చకు సిద్ధమైంది. భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకుని ఆ తరువాత నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈనెల 24న మరోసారి పాలకమండలి సమావేశం నిర్వహించి శ్రీవారి దర్శనం రద్దు విషయమై స్పష్టత ఇవ్వనున్నట్లు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెళ్లడించారు. తిరుమల ఆలయంలో ఆగస్టు 11 నుంచి 15 వరకు మహా సంప్రోక్షణ సందర్భంగా భక్తులకు శ్రీవారి దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఈనెల 14న అన్నమయ్యభవన్‌లో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఆలయంలో సీసీ కెమెరాలను సైతం పనిచేయకుండా ఆపేయాలనే నిర్ణయంపైనా చర్చ జరిగింది. అదే విధంగా మహా సంప్రోక్షణ సమయంలో కేవలం టీటీడీ బోర్డు సభ్యులు, వీఐపీలు, వీవీఐపీలకు ప్రత్యేక దర్శనాలు కల్పించాలని భావించినట్లు ప్రచారం జరిగింది. టీటీడీ పాలకమండలి తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా ప్రసార మాధ్యమాల్లో దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. దీంతో టీటీడీ పునరాలోచనలో పడింది. టీటీడీలోని ముఖ్య అధికారి ఇచ్చిన సలహా మేరకు మొదట దర్శనం రద్దు నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఏపీ సీఎం చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం.  

సాధ్యమైనంత మందికి శ్రీవారి దర్శనం  
మహాసంప్రోక్షణ సమయంలో సాధ్యమైనంత మందికి శ్రీవారి భాగ్యాన్ని కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు. మంగళవారం అన్నమయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాసంప్రోక్షణ జరిగే సమయంలో సెలవు రోజులు కావడంతో ఎక్కువ మంది భక్తులు తరలివస్తే భక్తులకు ఇబ్బంది కలుగుతుందని పాలకమండలి దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించిందన్నారు. భక్తుల అభిప్రాయాలను ఈనెల 24న పాలకమండలిలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
 
కుదింపు సమయాల్లోనే శ్రీవారి దర్శనం  

అష్టబంధన బాలలయ మహాసంప్రోక్షణం ఆగస్టు 11 నుంచి 15వతేదీ వరకు జరగనుంది. ఇందులో ఆగస్టు 11వతేదీ శనివారం రోజు మొత్తంలో 9గంట ల సమయాన్ని దర్శనానికి కేటాయించామన్నారు. 12వతేదీ ఆదివారం 4 గంటల సమయం, 13వతేదీ సోమవారం 5 గంటలు సమయం, 14వతేదీ మంగళవారం 5 గంటల సమయం, 15వతేదీ బుధవారం 6 గంటల సమయం మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. ఈరోజులలో సుమారు 30 గంటల సమయంలో మాత్రమే శ్రీవారి దర్శనాలు చేయించగలుగుతామన్నారు. రోజుకు సుమారు15వేల మందికి మాత్రమే అవకాశం ఉంటుందని ఈవో పేర్కొన్నారు.    

శ్రీవారి ఆలయం మూసివేతపై బాబు ఆగ్రహించినట్లు లీకులు  
సాక్షి, అమరావతి:  తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని ఆరు రోజులపాటు మూసివేయాలనే నిర్ణయంపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవడంతో దానిపై తాను ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకూల మీడియాలో లీకులిప్పించారు.  

మరిన్ని వార్తలు