రేపటి నుంచి సమీక్షలు

8 Jan, 2015 03:32 IST|Sakshi
రేపటి నుంచి సమీక్షలు

కర్నూలు(జిల్లా పరిషత్) : ఈ నెల 9, 10 తేదీల్లో కర్నూలులో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తెలిపారు. కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో ఉన్న మెగాసిరి ఫంక్షన్ హాలులో ఈ సమావేశాలు కొనసాగుతాయన్నారు. రెండు రోజులపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల బాధ్యులు, ముఖ్యులతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్చిస్తారని ఆయన తెలిపారు.

బుధవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లోని సమావేశహాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, మణిగాంధి, ఐజయ్య, గుమ్మనూరు జయరామ్, పార్టీ నాయకులు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, పత్తికొండ రామచంద్రారెడ్డి, ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, సీఈసీ సభ్యుడు హఫీజ్‌ఖాన్, గ్రీవెన్స్‌సెల్ కన్వీనర్ తెర్నేకల్ సురేందర్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.

9వ తేదీన నంద్యాల పార్లమెంటు స్థానంలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, 10వ తేదీన కర్నూలు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష నిర్వహిస్తారన్నారు. సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఆయా మండలాలు, జిల్లా పార్టీ ముఖ్యులతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. గత పార్లమెంటు, అసెంబ్లీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగిన తీరు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం తదితర అంశాలు చర్చిస్తామన్నారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆయా నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై సమీక్షిస్తామన్నారు. ఈ మేరకు గ్రామీణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలపై కూడా చర్చ ఉంటుందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కార్యకర్తల విషయంపై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
 
సమావేశాలకు ముఖ్యులకే అనుమతి

పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొంటున్నందున అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారని బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. అయితే ఈ నియోజకవర్గాల సమీక్షా సమావేశానికి ఆయా మండలాలు, జిల్లా, రాష్ట్ర నాయకులకు మాత్రమే అనుమతి ఉందని ఆయన చెప్పారు. అభిమానులు, కార్యకర్తలు ఈ విషయాన్ని అన్యదా భావించకుండా అర్థం చేసుకుని సహకరించాలన్నారు.
 
బుట్టదాఖలైన చంద్రబాబు హామీలు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరు నెలల కాలానికే జనాన్ని విసుగెత్తించారని విమర్శించారు. ఎన్నికల ముందు ఆయనిచ్చిన హామీల్లో ఏవీ సక్రమంగా అమలు చేయడం లేదని బుడ్డా రాజశేఖరరెడ్డి ద్వజమెత్తారు. రైతు రుణమాఫీపై స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో అనేక కొర్రీలు పెట్టి హామీనే మాఫీ చేస్తున్నారని అన్నారు. రూ.50 వేల రుణం కాదు కదా రూ.5 వేల రుణం కూడా మాఫీ కాలేదన్నారు. రుణమాఫీ పత్రాలు అందుకున్న రైతులు బ్యాంకుకు వెళితే తమకే డబ్బులు రాలేదని బ్యాంకు అధికారులు వెనక్కి పంపిస్తున్నారని మండిపడ్డారు.

డ్వాక్రా మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉందని అన్నారు. రుణాలు మాఫీ గాక, అప్పులు పుట్టక వారు దివాళా తీసే పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక పింఛన్‌దారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఆధార్ నెంబర్, ఫింగర్ ప్రింట్స్ పేరుతో వృద్ధులను, వికలాంగులను పోస్టాఫీసుల చుట్టూ రోజుల తరబడి తిప్పుకుంటూ వారి ఉసురు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల నుంచి పింఛన్ రాని వారు వేల మంది ఉన్నారని తెలిపారు.

వితంతువులకు భర్త డెత్ సర్టిఫికెట్లు తీసుకురమ్మని చెబుతున్నారని, ఎప్పుడో చనిపోయిన భర్త మరణ ధ్రువీకరణ పత్రాలను ఇప్పుడు ఆర్‌డీవో కార్యాలయాల చుట్టూ తిరిగి ఎలా తెచ్చుకుంటారని ఆయన ప్రశ్నించారు. అమలుకాని హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు ఇప్పుడు హామీలను మాఫీ చేయడానికి పడరాని పాట్లు పడుతున్నాడని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సమీక్షా సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.  

సమీక్షలు, నంద్యాల చెక్‌పోస్టు, సమావేశాలు,
Reviews, Nandyal check post, meetings
 

మరిన్ని వార్తలు